బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అవిశ్వాసం నుంచి గట్టెక్కిన బోరిస్ జాన్సన్ సర్కార్ కు ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేస్తున్నారు. దీంతో బోరిస్ జాన్సన్ సర్కార్ సంక్షోభంలో పడింది. ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా చేస్తున్న మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం రోజు మరో నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. చిల్డ్రన్, ఫ్యామిలీ మినిస్టర్ విల్ క్వీన్ తో పాటు రవాణా మంత్రి లారా ట్రాట్, ఆర్థిక సేవల మంత్రి జాన్ గ్లేర్, మరో మంత్రి విక్టోరియా అట్కిన్స్ బోరిస్ జాన్సన్ మంత్రి వర్గానికి రాజీనామా చేశారు. నాకు రాజీనామా సమర్పించడం తప్ప వేరే మార్గం లేదని మంత్రిపదవికి రాజీనామా చేస్తూ.. విల్ క్వీన్ వ్యాఖ్యానించారు.
Read Also: Viral: పది వేల ఇళ్లకు కరెంట్ కట్ చేసిన పాము..! ఎలాగో తెలుసా..?
అంతకుముందు యూకే ప్రభుత్వంలో కీలకం వ్యవహరిస్తున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ తో పాటు హెల్త్ మినిస్టర్ సాజిద్ జావిద్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రానున్న కాలంలో మరెంత మంది మంత్రులు రాజీనామా చేస్తారో చూడాలి. ఈ పరిణామం అధికార కన్సర్వేటివ్ పార్టీతో పాటు ప్రభుత్వంలో సంక్షోభంలోకి నెట్టేశాయి. బోరిస్ జాన్సన్ పై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం బ్రిటన్ పై తీవ్రంగా ఉంది. దీంతోనే మంత్రులు రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బోరిస్ జాన్సన్ చేసిన కొన్ని తప్పిదాలు కూడా ఇందుకు కారణం అయ్యాయి. కరోనా పీక్ స్టేజిలో ఉన్నప్పుడు బోరిస్ జాన్సన్ పార్టీ ఇవ్వడం వంటివి అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.
