అత్యంత శక్తివంతమైన కల్మేగి తుఫాను ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసింది. బుధవారం తుఫాన్ నానా బీభత్సం సృష్టించింది. ప్రకృతి విలయానికి దాదాపు 241 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయాలు పాలయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష్ల మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే గురువారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్టినాండ్ మార్కోస్ జూనియర్.. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరణాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆకస్మిక వరదలు కారణంగా అనేక మంది కొట్టుకుపోయారని తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Bengaluru: జంట ఘాతుకం.. ఇంటి యజమానిని చంపి మంగళసూత్రంతో పరారీ
తుఫాన్ ప్రభావానికి 2 మిలియన్ల ప్రజలు ప్రభావితం అయ్యారు. 560,000 మంది గ్రామస్తులు నిరాశ్రయులయ్యారు. దాదాపు 450,000 మందిని అత్యవసర ఆశ్రయాలకు తరలించినట్లు పౌర రక్షణ కార్యాలయం తెలిపింది. ఇక తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రావిన్సులకు మానవతా సాయం అందించేందుకు వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో ఆరుగురు చనిపోయినట్లు సైన్యం తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
కల్మేగి తుఫాన్ కారణంగా భారీ వరదలు సంభవించాయి. సెబు ప్రావిన్స్‌లో నది, జలమార్గాలు ఉప్పొంగి ప్రవహించాయి. ఫలితంగా నివాస ప్రాంతాలు మునిగిపోయాయి. పైకప్పులపైకి ఎక్కి రక్షించాలని ప్రజలు ప్రాధేయపడ్డారు. ఇక సెబులో కనీసం 71 మంది మరణించగా.. ఎక్కువగా నీటిలో మునిగిపోవడం వల్ల మరో 65 మంది తప్పిపోయారని, 69 మంది గాయపడ్డారని సివిల్ డిఫెన్స్ కార్యాలయం తెలిపింది. సెబు సమీపంలో ఉన్న నీగ్రోస్ ఆక్సిడెంటల్ సెంట్రల్ ప్రావిన్స్‌లో మరో 62 మంది తప్పిపోయినట్లు నివేదించబడింది. తుఫాన్ విషయంలో మేము చేయగలిగినదంతా చేశామని.. ఊహించని రీతిలో ఆకస్మిక వరదలు సంభవించాయని సెబు గవర్నర్ పమేలా బారికువాట్రో తెలిపారు.
