అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను పూర్తిగా నియంత అన్న ఫర్వాలేదు.. లేదంటే అత్యంత తెలివైన వ్యక్తి అని పిలిచినా నాకు అభ్యంతరం లేదు. కానీ నన్ను మూర్ఖుడు అని మాత్రం పిలవొద్దు.’’ అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం న్యూయార్క్‌లో తన మద్దతుదారులతో జరిగిన సభలో ట్రంప్ మాట్లాడారు.. మూర్ఖుడు అని పిలవడాన్ని తాను అస్సలు సహించలేనని.. కానీ తెలివైన నియంత అని పిలిస్తే అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. తన మానసిక సామర్థ్యంపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. “నేను మీరు ఎప్పుడైనా చూసే అత్యంత తెలివైన వ్యక్తిని” అంటూ సభలో ట్రంప్ వ్యాఖ్యానించారు. “దేశానికి తెలివైన అధ్యక్షుడు ఉండాలని మీరు కోరుకోరా?” అంటూ తన మద్దతుదారులను ప్రశ్నించారు. అసలు సభ జీవన వ్యయాల అంశంపై జరగాల్సి ఉండగా.. ట్రంప్ తనపై వచ్చిన మూర్ఖుడు వ్యాఖ్యల గురించి మాట్లాడటం ప్రారంభించారు.
“వాళ్లు నన్ను మూర్ఖుడు అన్నారు. అదే నాకు చాలా బాధ కలిగించింది” అని ట్రంప్ పేర్కొన్నారు. అనంతరం తన వైద్యుడితో జరిగిన సంభాషణను కూడా సభలో వివరించారు. “డాక్టర్.. నన్ను తెలివైన నియంత అని పిలిస్తే పర్లేదు. కానీ మూర్ఖుడు అని మాత్రం పిలవకూడదు. దాన్ని తప్పు అని నిరూపించడానికి నేను ఏదైనా పరీక్ష రాయాలా?” అని అడిగానన్నారు. దానికి వైద్యుడు “కాగ్నిటివ్ టెస్ట్” ఉందని చెప్పాడని ట్రంప్ తెలిపారు. “ఎంతమంది అధ్యక్షులు ఈ పరీక్ష రాశారు?” అని అడిగితే ఎవరూ రాయలేదని చెప్పారని పేర్కొన్నారు. మొదట ప్రశ్నలు సులభంగా ఉంటాయని.. తర్వాత కాస్త కఠినంగా మారతాయని ట్రంప్ వివరించారు. ఇప్పటికే పలుమార్లు తాను కాగ్నిటివ్ పరీక్షల్లో అద్భుతంగా రాణించానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
అయితే ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వైద్య నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టఫ్ట్స్ యూనివర్శిటీకి చెందిన మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ హెన్రీ డేవిడ్ అబ్రహాం.. తక్కువ వ్యవధిలో మూడుసార్లు ఈ పరీక్ష రాయడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మరోవైపు మాజీ జాన్స్ హాప్కిన్స్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ గార్ట్‌నర్.. ట్రంప్ మానసిక సామర్థ్యం క్షీణిస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అయితే అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ మాత్రం ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. చాలా కాలం తర్వాత అమెరికా చూసిన అత్యంత చురుకైన, దూరదృష్టి ఉన్న అధ్యక్షుడు ట్రంప్ అని ప్రశంసించారు.
President Trump:
"I don’t mind being called a brilliant, total tyrant dictator, but I don’t want to be called dumb."#Trump #PNC pic.twitter.com/qJHNAC1aLB
— People's news Channel (@peoplesnews2024) May 23, 2026
