Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్‌తో నెతన్యాహు ఫైర్!

  • డొనాల్డ్ ట్రంప్ - బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్‌లో విభేదాలు
  • ఇరాన్ విషయంలో రెండు మిత్రదేశాల మధ్య వివాదం
Trump Netanyahu

Trump Netanyahu

Trump – Netanyahu: ఇరాన్ వ్యవహారంలో అగ్రరాజ్యం అమెరికా, దాని చిరకాల మిత్రదేశం ఇజ్రాయెల్ మధ్య తాజాగా చెలరేగిన వ్యూహాత్మక విభేదాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణ అత్యంత ఉద్రిక్తంగా, తీవ్ర ఒత్తిడి నడుమ సాగిందని అమెరికన్ మీడియా సంస్థలు సంచలన కథనాలను ప్రచురించాయి. ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు దిగాలా? లేక దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలా? అనే అంశంపైనే ఇరు దేశాల అధినేతల మధ్య ప్రధానంగా వివాదం నడుస్తున్నట్లు సమాచారం.

ఈ ఫోన్ కాల్ సారాంశాన్ని బట్టి చూస్తే.. ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ఒకే తాటిపై లేవనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరగకుండా చూసేందుకు చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఇరాన్‌ను అణచివేయడానికి, ఆ దేశ అణు సామర్థ్యాలను పూర్తిగా దెబ్బతీయడానికి సైనిక చర్యే ఏకైక మార్గమని బలంగా నమ్ముతున్నారు. దాడులు ఆపితే ఇరాన్ మరింత బలోపేతం అవుతుందని ఆయన వాదిస్తున్నారు. ఒకవైపు అమెరికా అరబ్ దేశాల మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందాల వైపు మొగ్గు చూపుతుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్‌పై దూకుడుగా వెళ్లడానికే మొగ్గు చూపుతోంది. మిత్రదేశాల మధ్య తలెత్తిన ఈ అంతర్గత విభేదాలు రాబోయే రోజుల్లో పశ్చిమాసియా రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయోననే ఆందోళన వ్యక్తం అవుతున్నాయి.