Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

  • టర్కీలో ట్రంప్-మెలోనీ
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Trump5

Trump5

టర్కీ వేదికగా నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి నాటో సభ్య దేశాలు హాజరవుతున్నాయి. ఇటలీ ప్రధాని మెలోనీ కూడా వస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ అంకారా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఇద్దరికి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. ఈ వీడియో ప్రస్తుత నాటో సదస్సుకు సంబంధించినది కాకపోయినా.. ఇద్దరు నేతల మధ్య ఇటీవల పెరిగిన విభేదాల నేపథ్యంలో నెట్టింట షేర్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో గత ఏడాది గాజా యుద్ధం ముగిసిన అనంతరం శాంతి ఒప్పంద ప్రకటన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి చెందినదిగా తెలుస్తోంది. ఆ కార్యక్రమంలో ట్రంప్, మెలోనీ పరస్పరం పలకరించుకున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొందరు నెటిజన్లు మెలోనీ అసౌకర్యంగా కనిపించారని వ్యాఖ్యానిస్తుండగా.. మరికొందరు ఆ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు.

ఇటీవల ట్రంప్, మెలోనీ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. జీ7 సదస్సు సందర్భంగా తనతో ఫొటో దిగేందుకు మెలోనీ బతిమాలిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని తీవ్రంగా ఖండించారు. ‘‘ఇటలీ కానీ, నేను కానీ ఎవరినీ వేడుకోము’’ అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగని ట్రంప్.. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ‘‘Restraining Order Needed’’ అనే క్యాప్షన్‌తో మెలోనీకి సంబంధించిన ఎడిట్ చేసిన చిత్రాన్ని పోస్ట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మెలోనీ నిరాకరించడం కూడా ఇరువురి మధ్య దూరాన్ని పెంచింది. ఈ అంశంపై స్పందించిన ట్రంప్.. మెలోనీతో తన సంబంధాలు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ ఆమె ‘‘మంచి వ్యక్తి’’ అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్, మెలోనీ ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతున్నారు. ఈ సమయంలో వారి పాత హ్యాండ్‌షేక్ వీడియో మళ్లీ వైరల్ కావడంతో, ఇద్దరి మధ్య నెలకొన్న తాజా రాజకీయ, దౌత్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం నాటో సదస్సులో సభ్య దేశాల రక్షణ వ్యయాల పెంపు, ఉక్రెయిన్‌కు మద్దతు, ట్రాన్స్-అట్లాంటిక్ భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. సభ్య దేశాలు రక్షణ ఖర్చులను మరింత పెంచాలని ట్రంప్ చేస్తున్న డిమాండ్ సమావేశంలో ప్రధాన చర్చాంశంగా మారింది.