EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్

  • ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ
  • కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
  • ఈ నిర్ణయం వచ్చే వారం నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు
Donald Trump Tariffs

Donald Trump Tariffs

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల్లో తయారయ్యే కార్లు, ట్రక్కులపై 25 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈయూ దేశాలు అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని పాటించడం లేదని ట్రంప్ ఆరోపించారు. ఈ నిర్ణయం వచ్చే వారం నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం (Truth Social)లో రాసిన పోస్ట్‌లో, “ఈయూ మనతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తిగా పాటించడం లేదు. కాబట్టి ఈయూ కార్లు, ట్రక్కులపై వచ్చే వారం నుంచి 25% సుంకం విధిస్తాం” అని ప్రకటించారు. అమెరికాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి కార్లు, ట్రక్కులు తయారు చేస్తే ఎలాంటి సుంకం వర్తించదని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలు

వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నిర్ణయం వల్ల యూరోపియన్ కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు వస్తాయని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రయోజనం అని అన్నారు. ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయకపోతే బిలియన్ల డాలర్ల సుంకం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో 2025 ఆగస్టులో అమెరికా-ఈయూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం (Turnberry Agreement) ప్రకారం 15% సుంకం విధించారు. ఇప్పుడు దాన్ని 25%కి పెంచారు.

ఈయూ స్పందన

ట్రంప్ నిర్ణయంపై యూరోపియన్ పార్లమెంట్ అంతర్జాతీయ వాణిజ్య కమిటీ అధ్యక్షుడు బెర్ండ్ లెంగా తీవ్రంగా స్పందించారు. “అధ్యక్షుడు ట్రంప్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో అమెరికాను ఎలా నమ్మగలం? గ్రీన్‌ల్యాండ్ విషయంలో చూసినట్లుగానే సన్నిహిత మిత్రదేశాలతో కూడా ఇలా వ్యవహరించడం సరికాదు. దీనికి మేము స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాం” అని హెచ్చరించారు.