Site icon NTV Telugu

Spain Train Accident: స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుని.. వెనుక నుంచి ఢీకొట్టిన మరో రైలు

Spain Train Collision

Spain Train Collision

Train Collision In Spain Hurts 155 People: స్పెయిన్‌లో ఒక రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బార్సిలోనాకు సమీపంలోని ఒక స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుని, వెనుక నుంచి మరో రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 155 మందికి గాయాలు అవ్వడంతో.. వారిని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ.. రైలు వేగం తక్కువగా ఉండటంతో, భారీ ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొంటున్నారు. కమ్యునికేషన్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని, ఈ ప్రమాదానికి అసలు కారణాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పాు. ఒకవేళ ఢీకొట్టిన రైలు అతివేగంతో వచ్చి ఉంటే మాత్రం.. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేవని చెప్తున్నారు. తక్కువ వేగంతో రావడంతో.. ప్రాణనస్టం జరగలేదని, ఇది ఉపశమనం కలిగించే విషయమని అన్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి రాకెల్‌ సాంషెజ్‌ హామీ ఇచ్చారు.

కాటలోనియా రీజన్‌లో ఉదయం 6:50 గంటల (భారత కాలమానం ప్రకారం) సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ తీవ్రమైన గాయాలు కాలేదు. రైలులో నిలబడి ప్రయాణం చేసిన వారికే గాయాలు అయ్యాయని తేలింది. రైలు ఢీకొట్టినప్పుడు వాళ్లందరూ ఒక్కసారిగా కిందపడ్డారని, ఈ క్రమంలోనే స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. ఈ ప్రమాదం సంభవించడం వల్ల.. ఆ మార్గంలోని ఇతర రైళ్లను ఆపేయాల్సి వచ్చింది. ఈ ఘటన గురించి ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ.. ‘‘అప్పటివరకూ సరదాగా సాగిన ప్రయాణం, ఈ ఘటనతో ఒక్కసారిగా అతలాకుతలమైంది. జనాలందరూ గట్టిగా కేకలు వేశారు’’ అంటూ తన అనుభవాన్ని పంచుకుంది. ఇదిలావుండగా.. ఈ కాటలోనియా రీజన్‌లో ఇలాంటి ప్రమాదం సంభవించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం నుంచి సరైన ఫండ్స్ రాకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని రీజనల్ అధికారులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version