NTV Telugu Site icon

ఒమిక్రాన్‌ రీ ఇన్‌ఫెక్షన్‌ల ముప్పు 3 రేట్లు అధికం

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకున్న సందర్భంలో కొత్త కరోనా వేరింయట్‌ ఒమిక్రాన్‌తో మళ్లీ గతంలోని లాక్ డౌన్ లాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి.తాజాగా ఒమిక్రాన్‌ వేరింయట్‌పై పలు ఆసక్తికర విషయాలను శాస్ర్తవేత్తలు బయటపెట్టారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపడుతున్నారు. ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌తో రీఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉందని జొహెన్స్‌బర్గ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. గతంలో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వెలువడిన రోగనిరోధక శక్తిని కూడా తట్టుకునే లక్షణం ఒమిక్రాన్‌కు ఉందని వారు పేర్కొన్నారు.

సాధారణంగా కరోనా పాజిటివ్‌గా తేలిన మూడు నెలల అనంతరం మరోసారి కరోనా బారినపడితే దాన్ని రీఇన్‌ఫెక్షన్‌గా పేర్కొంటారు. కరోనాలోని బీటా, డెల్టా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ వల్ల రీఇన్‌ఫెక్షన్‌ ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు.. ఒమిక్రాన్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

గతంలో కరోనా నుండి కోలుకున్నవారు మరోసారి ఆ ఇన్‌ఫెక్షన్‌ బారినపడితే అది తీవ్రస్థాయి వ్యాధికి చేరే అవకాశం సహజంగానే తక్కువగా ఉంటుంది. అయితే ఒమిక్రాన్‌తో రీఇన్‌ఫెక్షన్‌ ముప్పు అధికంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో తీవ్రస్థాయి వ్యాధి నుంచి కలిగే రక్షణ కూడా తగ్గిపోతుందేమోనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్‌లు తీసుకుని గతంలో కరోనా బారినపడినవారిలోని రోగనిరోధక సామర్థ్యాన్ని కూడా ఒమిక్రాన్‌ తప్పించుకుని ఇన్‌ఫెక్షన్‌ను అదే పనిగా కొనసాగేలా చేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.