NTV Telugu Site icon

Salman Rushdie: దాడి చేసింది ఆ యువకుడే.. ఇరాన్‌లో హీరోగా కీర్తి

Hadi Matar Salman Rushdie

Hadi Matar Salman Rushdie

The Details Of Hadi Matar Who Attacked Salman Rushdie: న్యూయార్క్ నగరంలో ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే! అతడ్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు కానీ.. అతను ఎవరు? ఎందుకు చంపాడు? అనే విషయాలు బయటకు రాలేదు. ఇప్పుడు ఆ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువకుడి పేరు హాదీ మతార్. అతడి వయసు 24 ఏళ్లు. అమెరికా న్యూజెర్సీలోని ఫెయిర్ వ్యూ ప్రాంతంలో నివసిస్తుంటాడు. అతడు ఏ దేశానికి చెందినవాడో స్పష్టత రాలేదు కానీ.. కొన్ని ఆధారాల దృష్ట్యా ఇరాన్‌కి చెందినవాడు అయ్యుండొచ్చని తెలుస్తోంది.

హాదీ మతార్ ఫోన్‌లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్ ఖాసిమ్ సులేమానీ (2020లో హత్యకు గురయ్యాడు) ఫొటోని పోలీసులు గమనించారు. దాంతో.. అతడు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు సానుభూతిపరుడు అయ్యుంటాడని భావిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా అతనికి ఏ గ్రూపుతోనూ సంబంధాలు లేవని తేలింది. ఫేస్‌బుక్ పోస్టుల ఆధారంగా.. అతడు షియా అతివాద ధోరణుల పట్ల ఆకర్షితుడై ఉంటాడని అర్థమవుతోంది. తన సొంత సిద్ధాంతాలతోనే అతడు ఒంటరిగానే ఈ కార్యాచరణకు దిగి ఉంటాడని అనుకుంటున్నారు.

కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రష్దీ పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. రష్దీపై దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులకు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు దొరికాయి. వాటిని విశ్లేషించే పనిలో పడ్డారు. ఇదిలావుండగా.. 80వ దశకంలో రష్దీ రాసిన ‘ద శాటానిక్ వర్సెస్’ అనే పుస్తకం.. ఇరాన్ అధినాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ పుస్తకాన్ని 1988లో నిషేధించడమే కాదు.. రష్దీని చంపేయాలంటూ ఫత్వా కూడా జారీ చేసింది. ఇప్పుడు రష్దీపై హాదీ మతార్ దాడి చేయడంతో.. అతడ్ని ఇరాన్‌లో హీరోగా కీర్తిస్తున్నారు.

Show comments