సిరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ బస చేసిన హోటల్ సమీపంలో భారీ బాంబ్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా భద్రతా ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ పేలుళ్ల శబ్దం మాక్రాన్‌కు వినిపించలేదని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. పేలుళ్ల అనంతరం యథావిధిగా సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో నిర్ణయించిన ప్రకారమే సమావేశమయ్యారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పేలుళ్ల అనంతరం ఘటనాస్థలం సమీపంలో భారీగా పొగలు ఎగసిపడ్డాయి. వెంటనే భద్రతా బలగాలు రహదారులను మూసివేసి, ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. అయితే అధ్యక్షుడు మాక్రాన్ కాన్వాయ్‌కు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులు కూడా పేలుళ్లను ప్రత్యక్షంగా గుర్తించలేదని సమాచారం. అనంతరం సిరియా రాష్ట్ర టెలివిజన్.. మాక్రాన్-అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా సిరియా అధ్యక్ష భవనంలో సమావేశమైనట్లు ధృవీకరించాయి.
ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 2024లో బషర్ అల్-అసద్ ప్రభుత్వం కూలిన తర్వాత సిరియాను సందర్శించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశాధినేతగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిలిచారు. దీంతో ఈ పర్యటనపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది. ప్రస్తుతం సిరియా అధ్యక్షుడిగా ఉన్న అహ్మద్ అల్-షరా.. ఒకప్పుడు అల్-ఖైదాతో అనుబంధం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందినప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత పాశ్చాత్య దేశాలు, మధ్యప్రాచ్య దేశాలతో సన్నిహిత సంబంధాలు పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల అంతర్యుద్ధంతో ధ్వంసమైన సిరియాను పునర్నిర్మించడమే తన లక్ష్యమని చెబుతున్నారు.
అయితే దేశంలో ఇంకా భద్రతా పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు. గతంలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) వంటి ఉగ్రవాద సంస్థలు బలంగా పాతుకుపోవడం.. ఇటీవల కూడా ప్రభుత్వ అనుకూల బలగాలు, మత, జాతి మైనారిటీల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో వందలాది మంది మరణించడం వంటి పరిణామాలు సిరియాలోని భద్రతా సవాళ్లను స్పష్టం చేస్తున్నాయి. హోటల్ సమీపంలో జరిగిన తాజా పేలుళ్లు కూడా అదే పరిస్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.
The moment of the explosion that rocked French President Macron's residence in the Syrian capital, Damascus. pic.twitter.com/xBhlUzPyrf
— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinkle) July 7, 2026
Macron and Syrian President al-Sharaa visit mosque in Damascus pic.twitter.com/nSIGiRGraM
— RT (@RT_com) July 7, 2026

