Internet Apocalypse: సూర్యుడు గతంలో కన్నా ఎక్కువ శక్తిని విడుదల చేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యుడు తన 11 ఏళ్ల ‘సోలార్ సైకిల్’ అనే స్థితిలో ఉన్నాడు. ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు తారుమారవుతుంటాయి. అంటే దక్షిణ ధృవం ఉత్తరంగా, ఉత్తర ధృవం దక్షిణంగా మారుతుంటుంది. ఈ స్థితి సూర్యుడిపై శక్తి విపరీతంగా వెలువడుతుంది. సూర్యుడిపై సన్ స్పాట్స్ ఏర్పడటంతో పాటు భారీ విస్పోటనాలు సంభవిస్తుంటాయి. వీటి నుంచి సౌర తుఫానులు ఏర్పడుతుంటాయి. కొన్ని లక్షల కోట్ల టన్నుల ఆవేశపూరిత కణాలు ప్లాస్మా రూపంలో విశ్వంలోకి వెలువడుతుంటుంది. ఇలా సూర్యుడి నుంచి భారీ విస్పోటనాలు జరిగి పదార్థం విశ్వంలోకి ప్రసరించడాన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CMEs) అంటారు.
ఇదిలా ఉంటే రానున్న రెండు ఏళ్లలో సూర్యుడు ‘సోలార్ మాగ్జిమమ్’ అనే స్థితికి చేరుకుంటున్నాడు. అంటే రానున్న రోజుల్లో సూర్యుడి నుంచి మరింత భారీ విస్పోటనాలు జరిగే అవకాశం ఉంది. భారీ సౌరతుఫానులు ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2025 నాటికి సూర్యుడు మరింత చురుకుగా మారబోతున్నాడు. అయితే ఈ భారీ సౌరతుఫానుల వల్ల భూమిపై ‘ఇంటర్నెట్ అపొకలిప్స్’ ఏర్పడే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా ఉంది. అంటే ఇంటర్నెట్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే సౌర తుఫానుల వల్ల ఇంటర్నెట్ నాశనం అవుతుందని ఇప్పటి వరకు నాసాతో పాటు ఏ ఇతర స్పేస్ ఏజెన్సీ ప్రకటించలేదు. కానీ దీని గురించి మాత్రం బాగా చర్చ నడుస్తోంది.
Read Also: Tomato: టమాటా ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు…
సాధారణంగా సౌరతుఫానుల వల్ల భూమిపై ఉన్న జీవాజాలానికి ఎలాంటి ప్రమాదం ఉందడు. ఎందుకంటే భూమికి చాలా స్ట్రాంగ్ అయస్కాంత క్షేత్రం ఉంది. ఇది భూమిని సూర్యడి నుంచి వచ్చే కిరణాలు, ఇతర ఆవేశిత కణాల నుంచి భూమిని కాపాడుతుంది. ఈ సౌరతుఫానులు వల్ల ధృవాల వద్ద కాంతివంతమైన అరోరాలు ఏర్పడుతుంటాయి. అయితే కొన్నిసార్లు బలమైన సౌరతుఫానులు భూమిపై ఉన్న గ్రిడ్ వ్యవస్థను, కమ్యూనికేషన్ వ్యవస్థను నాశనం చేసే విషయాన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే 1859లో ‘కారింగ్ టన్’ ఈవెంట్ జరిగింది. దీని వల్ల టెలిగ్రాఫ్ లైన్లలో సమస్యలు ఏర్పడి ఆపరేటర్లు కరెంట్ షాక్ కి గురయ్యారు. అలాగే 1989లో సౌరతుఫాను కారణంగా క్యూబెక్ పవర్ గ్రిడ్ గంటల తరబడి స్తంభించిపోయింది. ఆ సమయాల్లో ఇంటర్నెట్ ఇప్పుడున్నంత విస్తృతంగా లేదు.
దీనిపై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సంగీత అబ్దు జ్యోతి ప్రకారం.. ఇలాంటి విపరీతమైన సంఘటనల్లో ఇప్పటి వరకు మనం అనుభవించలేదు. వీటికి మన మౌలిక సదుపాయాలు ఎలా స్పందిస్తాయో తెలియదని అన్నారు. ఆమె ఇంటర్నెట్ అపోకలిప్స్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. తీవ్రమైన సౌరతుఫానుల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉందని జ్యోతి తెలిపారు. ఇంటర్నెట్ అంతరాయం నెలల తరబడి కొనసాగుతాయని, కేవలం ఒక్క యూఎష్ లోనే కనెక్టివిటీ దెబ్బతిని రోజుకు 11 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఆర్థిక ప్రభావం ఉంటుందని అంచనా వేశారు.