Strikes On Ukraine Power Grid In Response To Crimea Attack Says Putin: ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహా పలు నగరాలు, పట్టణాల్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో చాలా చోట్ల అంధకారం అలుముకుంది. దీంతో పాటు విద్యుత్ లేకపోవడంతో తాగునీటి వంటి మౌళిక సదుపాయాలపై ప్రభావం పడుతోంది. ఇదిలా ఉంటే క్రిమియాలోని తన నౌకాదళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం వల్లే తాము ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్స్ లక్ష్యంగా దాడులు చేస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
గత వారం క్రిమియాలోని రష్యా నౌకాదళంపై డ్రోన్ అటాక్ జరిగింది. దీనికి కారణం ఉక్రెయిన్ అని రష్యా ఆరోపిస్తోంది. అయితే రష్యా ఆరోపణల్ని ఉక్రెయిన్ తోసిపుచ్చింది. గతంలో క్రిమియాను రష్యా మెయిన్ ల్యాండ్ ను కలిపే కేర్చ్ బ్రిడ్జిని కూల్చేసింది ఉక్రెయిన్. అప్పటి నుంచి రష్యా డ్రోన్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్ల సహాయంతో విధ్వంసం సృష్టిస్తోంది. ముఖ్యంగా దేశ విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చే పనిలో ఉంది. హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాములతో సహా ప్రధాన విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. విద్యుత్ లేకపోవడంతో ఇళ్లను వేడిగా ఉంటే పరికరాలు పనిచేయడం లేదు. దీంతో చలితో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Read Also: MLA Raja Singh: వీడియోలో ఉన్నది రాజాసింగ్ వాయిస్ కాదు.. నేడు మళ్లీ విచారణ
ఉక్రెయిన్ లోని రెండవ పెద్ద నగరమైన ఖార్కివ్ లో సుమారు 1,40,000 మందికి విద్యుల్ లేదని ఖార్కివ్ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే రష్యాకు చెందిన 50 క్షిపణుల్లో 44 క్షిపణులను కూల్చేశామని ఉక్రెయిన్ చెబుతోంది. రష్యా దాడుల వల్ల కీవ్ లో 80 శాతం మందికి నీటి సౌకర్యం నిలిచిపోయినట్లు తెలిపారు. సోమవారం ఉక్రెయిన్ లోని 10 ప్రాంతాల్లో 18 లక్ష్యాలపై డ్రోన్ దాడులు జరిగితే.. ఎక్కువగా విద్యుత్ వ్యవస్థలపైనే జరిగాయని ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ తెలిపారు.
క్రిమియాలోని సెవాస్టోపోల్ లోని ఓడలను లక్ష్యంగా చేసుకుంటూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడంపై రష్యా ఆగ్రహంతో ఉంది. ఈ దాడి తరువాత రష్యా శనివారం ధాన్యం ఎగుమతిని నిలిపేసింది. పౌర నౌకలు, సరకు రవాణా నౌకలపై ఎలాంటి దాడులు చేయమని ఉక్రెయిన్ హామీ ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రష్యా, ప్రపంచ ఆకలితో బ్లాక్ మెయిల్ చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆరోపించారు. నల్ల సముద్రంలో అనిశ్చితి కారణంగా, గోధుమ ఎగుమతులపై ప్రభావం పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో గోధుమల ధరలు 5 శాతం పెరిగాయి.