NTV Telugu Site icon

Age System: సౌత్ కొరియన్లు మరింత యవ్వనంగా మారబోతున్నారు.. కారణం ఏంటో తెలుసా..?

South Korea

South Korea

South Korea: దక్షిణ కొరియా ప్రభుత్వం తమ పౌరుల వయసును లెక్కించేందుకు అంతర్జాతీయ విధానాన్ని అనుసరించబోతోంది. బుధవారం నుంచి కొరియా ప్రభుత్వం ఈ విధానాన్ని పాటించనుంది. దీంతో అక్కడి పౌరుల వయసు ఒకటి నుంచి రెండుళ్లు తగ్గబోతోంది.

కొరియాలో వయసు ఇలా లెక్కించేవారు:

దక్షిణ కొరియాలో ప్రజల వయసును మూడు రకాలుగా లెక్కిస్తున్నారు. అంతర్జాతీయ విధానం, కొరియన్ వయసు, క్యాలెండర్ వయసు ఇలా మూడు రకాలుగా ఒక్కో వ్యక్తి మూడు రకాల ఏజ్ లు ఉంటున్నాయి. సాధారణంగా మనం పిల్లలు పుట్టినప్పుడు అతడి వయసును ‘0’గా పరిగణిస్తారు. మళ్లీ ఏడాది పుట్టిన రోజు వస్తే వయసును ఒకటిగా లెక్కిస్తారు. చాలా దేశాల్లో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు.

అయితే కొరియాలో మాత్రం ఇందుకు భిన్నంగా వయసు లెక్కింపు జరుగుతుంది. దక్షిణ కొరియాలో శిశువు పుట్టిన రోజును ఒక ఏడాదిగా లెక్కిస్తారు. ఆ తరువాత జనవరి 1 రాగానే మరో ఏడాది వయసు వచ్చినట్లుగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక శిశువు డిసెంబర్ 31న జన్మించిందని అనుకుంటే.. జనవరి 1 రాగానే అతడికి రెండేళ్లు అవుతాయి.

ఇక క్యాలెండర్ విధానం ప్రకారం.. శిశువు పుట్టగానే వయసు జీరోగానే ఉంటుంది. జనవరి 1 రాగానే ఒక ఏడాదిగా లెక్కిస్తారు. శిశువు ఏ ఏ నెలలో ఏ తేదీన పుట్టినా కూడా జనవరి 1 రాగానే అతడి వయసు లెక్కింపులోకి వస్తుంది.

అంతర్జాతీయ విధానం ప్రకారం.. భారత్ తో సహా చాలా దేశాల్లో అనుసరించే విధంగానే ఒక శిశువు ఏ తేదీన పుడితే.. తర్వాతి ఏడాది అదే తేదీన శిశువకు ఒక సంవత్సరంగా లెక్కిస్తారు.

వయసుతో ఇబ్బందులు:

దక్షిణ కొరియా ప్రజలు సాధారణంగా రోజూవారీ వ్యవహారాల్లో కొరియన్ వయసును ఉపయోగిస్తుంటారు. చట్టపరమైన, అధికార విషయాల్లో అంతర్జాతీయ వయసును ఉపయోగిస్తారు. ఇక మద్యపానం, ధూమపానం, నిర్భంద సైనిక శిక్షణ వంటి విషయాల్లో క్యాలెండర్ వయసును పరిగణలోకి తీసుకుంటారు. ఇలా పలు విషయాల్లో మూడు రకాల వయసును పేర్కొనడం వల్ల ఇన్సూరెన్స్ పాలసీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ గందరగోళానికి తెరదించడానికి పుట్టిన తేదీనే పరిగణలోకి తీసుకుంటున్నట్లు జూన్ 28న దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి మూడొంతుల కొరియన్ ప్రజలు మద్దతు తెలిపినట్లు అక్కడి సర్వేలు పేర్కొన్నాయి.

Show comments