దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు అభిశంసన ముప్పు పొంచి ఉన్నట్లుగా కనిపిస్తోంది. గత నాలుగేళ్లుగా వెంటాడుతున్న ‘ఫాలా ఫాలా’ నగదు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అధ్యక్షుడు రమఫోసా ఫాలా ఫాలా గేమ్ ఫామ్‌లో జరిగిన దొంగతనం కేసుపై పార్లమెంటరీ విచారణను రద్దు చేయాలని కోరుతూ రమఫోసా న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఈ న్యాయపోరాటం అధ్యక్షుడిపై అభిశంసన ముప్పును మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివాదం ఏంటి?
రమఫోసాకు చెందిన వన్యప్రాణుల ఫామ్‌లో జరిగిన చోరీలో సుమారు $5,80,000 (రూ.4.8 కోట్లకు పైగా) నగదు దొంగిలించబడింది. ఈ డబ్బును ఫామ్‌లోని ఫర్నిచర్‌లో దాచినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంత భారీ మొత్తంలో నగదును అక్కడ ఎందుకు ఉంచారు? దాన్ని ఎలా దాచారు? చోరీ తర్వాత నగదును తిరిగి పొందేందుకు ఏం జరిగింది? అనే అంశాలపై అప్పట్లో తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. ఈ వివాదం రమఫోసా ప్రతిష్ఠకు కూడా సవాల్‌గా మారింది. అవినీతి ఆరోపణలతో దెబ్బతిన్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC)కు రమఫోసా అవినీతికి భిన్నమైన, స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఫాలా ఫాలా వ్యవహారం ఆ ఇమేజ్‌ను దెబ్బతీసింది.
అభిశంసనపై కోర్టులో పోరాటం
ఈ వ్యవహారం మొదలై నాలుగేళ్లు గడిచినా వివాదం మాత్రం ఇంకా కొనసాగుతోంది. పార్లమెంటరీ విచారణకు పునాది వేసిన నివేదికను చట్టవిరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ రమఫోసా తరఫు న్యాయవాదులు వెస్టర్న్ కేప్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ విచారణ శుక్రవారం ముగియనుండగా.. ఈ నెలలోనే తీర్పు వెలువడే అవకాశం ఉంది. కోర్టు నిర్ణయం రమఫోసాకు కీలకంగా మారనుంది. వివాదాన్ని రాజకీయంగా ఎదుర్కొంటారా? లేక అభిశంసన ప్రక్రియకు మరోసారి బాటలు పడతాయా? అన్నది తీర్పుపై ఆధారపడి ఉంటుంది.
2022లో పార్లమెంటరీ ప్యానెల్.. రమఫోసా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఉండొచ్చని, తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే అప్పట్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC) ఆధిపత్యంలో ఉన్న పార్లమెంట్ పూర్తి స్థాయి అభిశంసన విచారణకు వెళ్లేందుకు నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు సవాల్ చేశాయి. దీంతో మే నెలలో కాన్స్టిట్యూషనల్ కోర్టు పార్లమెంట్ ఈ ప్రక్రియను పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో నవంబర్‌లో జరగనున్న స్థానిక ఎన్నికలకు ముందు ఫాలా ఫాలా వివాదం మరోసారి దక్షిణాఫ్రికా రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.
ఎలాంటి తప్పూ చేయలేదన్న అధ్యక్షుడు
ఫాలా ఫాలా వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రమఫోసా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న నగదు.. సూడాన్‌కు చెందిన ఓ వ్యాపారికి గేదెలను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బేనని తెలిపారు. అలాగే చోరీకి గురైన నగదును తిరిగి పొందేందుకు జరిగిన చర్యల గురించి తనకు తెలియదని, అందులో తాను ఎలాంటి పాత్ర పోషించలేదని రమఫోసా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆయన న్యాయపోరాటం 2022 పార్లమెంటరీ ప్యానెల్ నివేదికను సవాల్ చేయడంపైనే ప్రధానంగా కేంద్రీకృతమైంది. ఆ ప్యానెల్ తప్పు న్యాయ ప్రమాణాలను ఉపయోగించిందని, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆర్థర్ ఫ్రేజర్ చేసిన ఆరోపణలతో పాటు తన వాదనలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని రమఫోసా న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ వ్యవహారం కారణంగా పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లను కూడా రమఫోసా తిరస్కరించారు. మేలో 2022 నివేదిక తీవ్ర లోపాలతో ఉందని పేర్కొన్న ఆయన.. తాను పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రమఫోసా, ANCపై పెరుగుతున్న ఒత్తిడి
ఈ కేసు రమఫోసాతో పాటు ANCకి కూడా కీలకంగా మారింది. 2024లో ANC పార్లమెంటరీ మెజారిటీని కోల్పోయింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతూనే.. 2027 డిసెంబర్‌లో జరగనున్న పార్టీ నాయకత్వ సమావేశంపై కూడా దృష్టి పెట్టింది. కోర్టులో రమఫోసాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినంత మాత్రాన ఆయన వెంటనే అధ్యక్ష పదవి కోల్పోయే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఈ వివాదం కొనసాగడం వల్ల ఆయన రాజకీయ బలం క్రమంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ANCలో ఆయన వర్గం బలహీనపడటం, పార్టీ తదుపరి నాయకత్వాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలకు ఇబ్బందులు ఎదురుకావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ANCలో అంతర్గత మద్దతు కోల్పోయిన అధ్యక్షులను గతంలో పార్టీ వెనక్కి పిలిపించిన సందర్భాలు ఉన్నాయి. థాబో ఎంబేకి 2008లో, జాకబ్ జుమా 2018లో పార్టీ మద్దతు కోల్పోయిన తర్వాత పదవుల నుంచి వైదొలిగారు.
జుమా ‘న్కాండ్లా’ వివాదంతో పోలిక
ఫాలా ఫాలా వివాదం నిరంతరం వార్తల్లో ఉండటం రమఫోసాకు మరో సమస్యగా మారింది. ప్రతి ఆలస్యం ఆయనకు కొంత సమయం ఇస్తున్నప్పటికీ.. అదే సమయంలో ఈ వ్యవహారం ప్రజల చర్చలో కొనసాగుతోంది. ఈ పరిణామాలను మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా ఎదుర్కొన్న ‘న్కాండ్లా’ వివాదంతో కూడా కొందరు పోలుస్తున్నారు. జుమా వ్యక్తిగత నివాసమైన న్కాండ్లాలో ప్రభుత్వ నిధుల వినియోగంపై సంవత్సరాల పాటు కొనసాగిన వివాదం ప్రజల్లో ఆగ్రహానికి దారితీసింది. అనంతరం ANCలో ఆయన రాజకీయ స్థానం బలహీనపడింది. రమఫోసాకు కూడా సమస్య కేవలం కోర్టుకే పరిమితం కాలేదు. దక్షిణాఫ్రికాలో అధిక నిరుద్యోగం, తీవ్రమైన నేర సమస్యలు వంటి అంశాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫాలా ఫాలా వివాదానికి త్వరగా ముగింపు రావాలని కొంతమంది ఓటర్లు కోరుకునే అవకాశం ఉంది.
కోర్టు తీర్పుపైనే అందరి దృష్టి
ఫాలా ఫాలా కేసులో కోర్టు తీసుకునే నిర్ణయం రమఫోసా రాజకీయ భవిష్యత్తుపైనే కాకుండా ANC విశ్వసనీయత, దక్షిణాఫ్రికా తదుపరి ఎన్నికలు, పార్టీ నాయకత్వ పోరుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అధ్యక్షుడి న్యాయపోరాటం ప్రస్తుతం దక్షిణాఫ్రికా రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటిగా మారింది.

