Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా

  • డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగొస్తానని షేక్ హసీనా ప్రకటన
  • అరెస్టు, హత్య, చిత్రహింసల ప్రమాదం ఉన్నా వెనక్కి తగ్గనని వ్యాఖ్య
  • ఆశ్రయం కల్పించిన భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు
Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన స్వదేశానికి తిరిగి వెళ్లాలనే నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తనను అరెస్ట్ చేసినా, చంపినా, చిత్రహింసలకు గురిచేసినా వెనక్కి తగ్గబోయేది లేదని ఆమె అన్నారు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్ తిరిగి వెళ్తున్నట్లు ప్రకటించారు. వాషింగ్టన్ కేంద్రంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వర్చువల్‌గా మాట్లాడారు. బంగ్లాదేశ్ తిరిగి వెళ్లడం తనకు ప్రమాదకరమని తెలుసని, అయినప్పటికీ తన మద్దతుదారులతో కలిసి నిలబడటం రాజకీయ బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. హసీనా ప్రకటనపై ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ఎప్పడు వెళ్తామనే దానిపై నిర్దిష్ట తేదీని నిర్ణయించలేదని, సమయం వచ్చినప్పుడు చెబుతామని ప్రకటించారు.

2024 ఆగస్టులో హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ఢాకా నుంచి భారత్ వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఆందోళనల్లో మానవత్వానికి విరుద్ధంగా పలువురు మరణాలకు కారణమయ్యారనే ఆరోపణలపై అక్కడి కోర్టు షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.

ఇదిలా ఉంటే, రాజకీయ సంక్షోభ సమయంలో తనకు ఆశ్రయం కల్పించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.1975లో తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులు హత్యకు గురైన ఘటనను ప్రస్తావిస్తూ.. అప్పట్లో తాను, తన సోదరి ప్రాణాలతో బయటపడ్డామని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కూడా భారత్ తమను ఆదుకుందని చెప్పారు. 1975లో తన కుటుంబ హత్యల తర్వాత షేక్ హసీనా 1981లో స్వదేశానికి తిరిగి వెళ్లారు.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వంపై కూడా షేక్ హసీనా తీవ్ర విమర్శలు చేశారు. తనపై, తన అవామీ లీగ్ నాయకులపై క్రిమినల్ కేసుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. బంగ్లాదేశ్ భవిష్యత్తును ఆ దేశ ప్రజలే స్వేచ్చాయుతమైన, అందరిని భాగస్వాములను చేసే ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా నిర్ణయించాలని ఆమె అన్నారు.