Saudi Arabia: సౌదీ అరేబియాలో బంగ్లాదేశ్‌కు చెందిన యువకుడు నజ్రుల్ ఇస్లాం, మహిళ స్వీటీ అక్తర్‌కు మరణశిక్ష విధించడం సంచలనంగా మారింది. అయితే, 50 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా సొంత రాజకుటుంబానికి చెందిన యువరాణిని కూడా బహిరంగంగా కాల్చి చంపింది. ప్రేమించినందుకు ఆమెకు ఈ మరణశిక్ష విధించబడింది. జెడ్డాలోని నడిరోడ్డులో శిక్ష అమలు చేశారు. ఆమె ప్రియుడి తల నరికి మరణశిక్షను అమలు చేశారు.
సౌదీ పాలక రాజకుటుంబానికి చెందిన 19 ఏళ్ల యువరాణి మిషాల్ బింట్ ఫహద్ అల్ సౌద్‌ను 1977లో జెడ్డాలో బహిరంగంగా కాల్చి చంపారు. ఈమె యువరాజు మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్‌కు మనవరాలు. ఆమె ప్రియుడు ఖాలిద్ అల్-షాయర్ ముహల్హల్‌కు కూడా మరణశిక్ష అమలు చేశారు.
ప్రేమించడమే పాపం..
మిషాల్ బింట్ ఫహద్ అల్ సౌద్ సౌదీ రాజకుటుంబానికి చెందిన యువరాణి. చదువు కోసం లెబనాన్ రాజధాని బీరూట్ వెళ్లిన సమయంలో ఖాలిద్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఖాలిద్ లెబనాన్‌లో సౌదీ అరేబియా రాయబారిగా ఉన్న అలీ హసన్ అల్ షాయర్ మేనల్లుడు.
అయితే, ఆ రోజుల్లో రాజకుటుంబంలోని స్త్రీలపై పురుషుల పెత్తనం స్పష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే యువరాణికి కుటుంబం ఒక వ్యక్తితో పెళ్లి కుదిర్చింది. కానీ తనకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మిషాల్ భావించింది. ఈ విషయం కుటుంబంలో తెలియడంతో ఆమెను మరణశిక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది.
దేశం విడిచిపెట్టే ప్రయత్నం..
అంతర్జాతీయ మీడియ కథనాల ప్రకారం.. మిషాల్, ఖాలిద్‌లు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇందు కోసం నకిలీ పాస్‌పోర్టులు ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. పురుషుడిలా వేషం మార్చుకున్న మిషాల్ జెడ్డా ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బందికి పట్టుబడినట్లు తెలుస్తోంది. వీరిద్దరు వ్యభిచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. సౌదీ న్యాయవ్యవస్థలో ఇస్లామిక్ షరియా చట్టాల ఆధారంగా విచారణ జరిగింది.
1977లో మరణశిక్ష అమలు..
నిజానికి, నేరం ఒప్పుకోవద్దని రాజకుటుంబం మిషాల్‌కు చెప్పింది. అలా చేస్తే ఆమె ప్రాణాలు దక్కేవి, కానీ అందుకు ఆమె నిరాకరించింది. నేరాన్ని ఒప్పుకుంది. 1977 జూలై 15న, జెడ్డాలోని ఒక పార్కులో ‘క్వీన్స్ బిల్డింగ్’ సమీపంలో మిషాల్ ను కాల్చి చంపారు. ఆ తర్వాత ఖాలిద్ తల నరికి శిక్ష అమలు చేశారు.
ప్రేమ కోసం ప్రాణాలు వదిలిన యువరాణి..
ప్రేమ కోసం ప్రాణాలు వదిలిన యువరాణిగా మిషాల్ చరిత్రలో నిలిచారు. 1977లో బ్రిటీష్ చిత్ర నిర్మాత ఆంథోనీ థామస్ లండర్‌లో ఈమె కథ విన్నారు. ఆంథోనీ థామస్ ఈ సంఘటన గురించి ‘డెత్ ఆఫ్ ఏ ప్రిన్సెస్’ అనే డాక్యుడ్రామా చిత్రాన్ని రూపొందించారు. యువరాణి మరణం కేవలం చట్టపరమైన శిక్ష మాత్రమే కాదని, కుటుంబ పరువు, ప్రతీకార చర్యలు కూడా ఇందులో పాత్ర పోషించాయని ఆ చిత్రం పేర్కొంది. సౌదీ ప్రభుత్వం దీని ప్రసారాన్ని వ్యతిరేకించింది. ఇస్లామిక్ షరియా ప్రకారం మరణశిక్ష విధించబడిందని చెప్పుకొచ్చింది.
50 ఏళ్ల తర్వాత మళ్లీ చర్చ..
బంగ్లాదేశ్‌కు చెందిన నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ ఇద్దరికి సౌదీ మరణశిక్ష విధించింది. మక్కాలోని ఓ మసీదులో వీరిద్దరు ‘‘అనైతిక చర్యలకు’’ పాల్పడిన ఆరోపణలతో వీరికి మరణశిక్ష అమలు చేశారు. అయితే, వీరిద్దరు కేవలం ముద్దు పెట్టుకున్నారని సోషల్ మీడియాలో కథనాలు చెబుతున్నాయి. ముద్దు పెట్టుకుంటే మరణశిక్ష విధిస్తారా? అనే ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం మరణశిక్ష గురించి తమకు చెప్పలేదని సౌదీపై ఆరోపణలు చేస్తున్నారు.

