NTV Telugu Site icon

Saudi Arabia: ఏడాదిలో 300 మందికి పైగా మరణశిక్షలు అమలు చేసిన సౌదీ అరేబియా..

Saudi Arabia Execution

Saudi Arabia Execution

Saudi Arabia: సౌదీ అరేబియా ఈ ఏడాదిలో 300 మందికి పైగా ఖైదీలకు మరణశిక్ష విధించింది. మంగళవారం మరో నలుగురికి ఉరిశిక్ష విధించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురికి, హత్య నేరంలో ఒకరికి శిక్షని అమలు చేసింది. ఆ దేశ స్టేట్ మీడియా లెక్కల ఆధారంగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 303 మందికి మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది.

రాజరిక పాలనలో ఉన్న సౌదీలో సెప్టెంబర్ చివరినాటికి 200 మందికి మరణశిక్ష అమలు చేసింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, 2023లో చైనా, ఇరాన్ తర్వాత సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఖైదీలకు మరణశిక్ష విధించింది. 2022లో ఇవి 196గా ఉన్నాయి. 2023లో 170 మందికి మరణశిక్షను అమలు చేసింది. ఇలా మరణశిక్షల్ని విధించడాన్ని మానవహక్కుల సంస్థలు తప్పుబడుతున్నాయి. జీవించే హక్కు పట్ల సౌదీ అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. 2022లో క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ది అట్లాంటిక్‌తో మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో తప్పితే, పలు కేసుల్లో మరణశిక్షను తొలగించిందని చెప్పారు.

Read Also: Paracetamol : భారత్ లోనే తయారీ.. అతితక్కువ ధరకే లభించనున్న పారాసెటమాల్

అయితే, అందుకు విరుద్ధంగా మరణశిక్షల లెక్కలు పెరిగిపోతున్నట్లు హక్కుల సంస్థలు చెబుతున్నాయి. 1990కి ముందు ఈ శిక్షల గణాంకాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ..పవిత్ర మక్కాపై ఇస్లామిస్ట్ మిలిటెంట్ల అటాక్ తర్వాత 1980లో 63 మందికి శిరచ్ఛేదం చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ప్రజాశాంతిని కాపాడటానికి మరణశిక్షలు అవసరమని గతంలో సౌదీ పేర్కొంది.

మంగళవారం నాటికి ఈ ఏడాది మరణశిక్షల్లో 103 మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో సంబంధం ఉన్న వారు, 45 మంది ఉగ్రవాద కేసుల్లో దోషులుగా ఉన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా నేరస్తులకు ఉరిశిక్షపై ఉన్న మూడేళ్ల తాత్కాలిక నిషేధాన్ని సౌదీ 2022లో ముగించింది. సౌదీ అరేబియా 113 మంది విదేశీయులను కూడా ఉరితీసింది. ఇది ఓ రకంగా రికార్డుగా చెప్పబడుతుంది. సౌదీ అరేబియా 2015లో కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 1,000 మందికి పైగా ఉరిశిక్షలను అమలు చేసింది. 2022 మార్చిలో తీవ్రవాద నేరారోపణల కోసం ఒకే రోజు 81 మందిని ఉరితీశారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.

Show comments