Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి

Russia Plane Crash

Russia Plane Crash

Russia Plane Crash: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో రష్యా సైన్యానికి చెందిన An-12 రవాణా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని సిబ్బందితో సహా మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రాథమిక విచారణలో విమానంలోని సాంకేతిక పరికరాల్లో తలెత్తిన లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. An-12 సైనిక రవాణా విమానం మంగళవారం కెమెరోవో ప్రాంతంలోని యాగునోవో గ్రామం సమీపంలో కూలిపోయింది. జనసంచారం లేని ప్రాంతంలో విమానం కూలిపోవడంతో నేలపై ఉన్న ఇతరులకు ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో పైలట్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. దురదృష్టవశాత్తూ వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు రష్యా వైమానిక దళానికి చెందిన నిపుణులకు విచారణ బాధ్యతలు అప్పగించారు.

ఈ ప్రమాదం రష్యా రాజధాని మాస్కోకు సుమారు 3,000 కిలోమీటర్ల తూర్పున ఉన్న పశ్చిమ సైబీరియా ప్రాంతంలో చోటుచేసుకుంది. కెమెరోవో ప్రాంతంలోని యాగునోవో గ్రామ సమీపంలో విమానం కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలోని సాంకేతిక వ్యవస్థల్లో లోపం తలెత్తి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఏయే పరికరాలు పనిచేయలేదు? పైలట్లు విమానంపై నియంత్రణ ఎందుకు కోల్పోయారు? అనే అంశాలపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు.

An-12 అనేది సోవియట్ యూనియన్ కాలంలో రూపొందించిన సైనిక రవాణా విమానం. ఇందులో నాలుగు టర్బోప్రాప్ ఇంజిన్లు ఉంటాయి. సైనికులను, యుద్ధ పరికరాలను, ఇతర అవసరమైన సామగ్రిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు దీనిని రూపొందించారు. 1950వ దశకం చివరి కాలం నుంచి ఈ విమానాలు సేవలందిస్తున్నాయి. సాధారణంగా An-12 విమానంలో ఆరుగురు సిబ్బంది ఉంటారు. ఈ విమానానికి చెందిన 1,000కు పైగా మోడళ్లను తయారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కూడా రష్యాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు ఈ విమానాలను సైనిక రవాణా అవసరాల కోసం వినియోగిస్తున్నాయి.