Site icon NTV Telugu

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!

Russia Ukraine War

Russia Ukraine War

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరోసారి అత్యంత భీకరంగా మారింది. ఏప్రిల్ 24 – 25 తేదీల్లో రష్యా జరిపిన భారీ వైమానిక దాడికి ఉక్రెయిన్‌ను అతలాకుతలం చేసింది. నిజానికి ఈ దాడి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఊహించని మలుపు తిప్పింది. గడిచిన 24 గంటల్లో ఉక్రెయిన్‌లోని కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద వైమానిక దాడికి పాల్పడింది. ఏకంగా 666 క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ గగనతలాన్ని రష్యా దడదడలాడించింది.

ముప్పేట దాడి..
ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 24 రాత్రి 6 గంటల నుంచి రష్యా ఈ విధ్వంసాన్ని ప్రారంభించింది. ఈ దాడిలో మొత్తం రష్యా మొత్తం 47 మిసైళ్లను ప్రయోగించింది. ఇందులో 12 బాలిస్టిక్ క్షిపణులు (ఇస్కందర్-ఎం, ఎస్-400), 29 ఖా-101 (Kh-101) క్రూయిజ్ మిసైళ్లు, 5 కాలిబర్ మిసైళ్లు ఉన్నాయి. డ్రోన్ల విషయానికి వస్తే ఏకంగా 619 డ్రోన్లను రష్యా ఉక్రెయిన్ వైపు పంపింది. వీటిలో ఎక్కువ భాగం ఇరాన్ తయారీ ‘షాహెద్’ రకానికి చెందిన కామికాజ్ (ఆత్మహుతి) డ్రోన్లే కావడం గమనార్హం. ఇవి నేరుగా లక్ష్యాన్ని ఢీకొని పేలిపోతాయి.

దీటుగా బదులిచ్చిన ఉక్రెయిన్ ..
ఇంతటి భారీ దాడిని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా ఎదుర్కొంది. కీవ్ వాయుసేన దాదాపు 610 లక్ష్యాలను గాలిలోనే కూల్చివేసింది. ఇందులో 30 మిసైళ్లు, 580 డ్రోన్లు ఉన్నాయి. ముఖ్యంగా 26 ఖా-101 మిసైళ్లను, 4 కాలిబర్ మిసైళ్లను పేల్చివేయడం ద్వారా పెను ప్రమాదాన్ని తప్పించామని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ తన రక్షణ వ్యవస్థతో రష్యా దాడులను అడ్డుకున్నప్పటికీ, కొన్ని మిసైళ్లు లక్ష్యాలను తాకాయి. సుమారు 13 మిసైళ్లు, 36 డ్రోన్లు ఉక్రెయిన్ గడ్డపై పడ్డాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా 23 ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. మరో 9 చోట్ల కూల్చివేసిన డ్రోన్ల శిధిలాలు పడి ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈసారి రష్యా తన వ్యూహాన్ని మార్చి భూమి, సముద్రం, గగనతలం నుంచి ముప్పెట దాడులు చేసింది. రష్యాలోని మిల్లెరోవో, కుర్స్క్, బ్రయాన్స్క్ ప్రాంతాల నుంచి భూమి ద్వారా, కాస్పియన్ సముద్రం, క్రిమియా నుంచి సముద్రం ద్వారా క్షిపణులను ప్రయోగించింది. రష్యా అనుసరిస్తున్న ఈ ‘మల్టీ డైమెన్షనల్ అటాక్’ స్ట్రాటజీ ఇప్పుడు ఉక్రెయిన్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Exit mobile version