NTV Telugu Site icon

Rishi Sunak: యూకే ప్రధాని పీఠానికి అడుగు దూరంలో రిషి.. ఐదో రౌండ్లోనూ ఘన విజయం

Rishi Sunak, Liz Truss

Rishi Sunak, Liz Truss

UK PM race..Rishi Sunak wins 5th round: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. యూకే ప్రధాని పీఠానికి మరో అడుగుదూరంలో రిషి సునక్ ఉన్నారు. ఈ ఘట్టాన్ని దాటితే యూకేకు తొలి భారత సంతతి ప్రధానిగా రిషి సునక్ చరిత్రకెక్కనున్నారు. వరసగా ఐదు రౌండ్లలో విజయం సాధించారు. తాజాగా బుధవారం జరిగిన ఐదో రౌండ్లో కూడా రిషి సునక్ గెలిచి అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని పీఠం కోసం ఎవరితో పోటీ పడతారనే దానికి సస్పెన్స్ కూడా వీడింది. చివరిదైన ఐదో రౌండ్లో రిషి సునక్, లిజ్ ట్రస్ నిలిచారు. వీరిద్దరి మధ్యే ప్రధాన మంత్రి పోటీ ఉండబోతోంది. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ పోటీ నుంచి నిష్క్రమించారు. ఐదో రౌండ్ లో రిషి సునక్ కు 137 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. లిజ్ ట్రస్ కు 113 ఓట్లు వచ్చాయి. పెన్నీ మోర్డాంట్డ 105 ఓట్లతో మూడో స్థానంలో నిలిచి ఎలిమినేట్ అయ్యారు.

Read Also: Srilanka Crisis: నిత్యావసరాలు, మందుల కోసం శరీరాన్ని అమ్ముకుంటున్న మహిళలు

1,80,000 మంది సభ్యులుగా ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడిని బ్యాలెట్ పద్దతిలో వీరంతా ఎన్నుకోనున్నారు. మొత్తం సభ్యుల్లో మూడో వంతు సభ్యులు మద్దతు లేదా 120 మంది సభ్యులు మద్దతు తెలిపినవారే ప్రధానిగా ఎన్నిక అవుతారు. ప్రధానిగా ఎవరు గెలిచారనే విషయాన్ని సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు. ఈ సారి ప్రధానిగా రిషి సునక్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉందని అక్కడి మీడియా చెబుతోంది. భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని బోరిస్ జాన్సన్ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రిషి సునక్ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తికి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షిత మూర్తిని రిషి సునక్ వివాహం చేసుకున్నారు. 42 ఏళ్ల రిషి సునక్ యూకే ప్రధాని అయితే.. అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా.. మొదటి దక్షిణాసియాకు చెందిన ప్రధానిగా రికార్డులకెక్కనున్నారు.