“ఏంటి ఇది? సముద్రం ఎరుపెక్కిపోయిందా?” అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చాలామందిని భయపెడుతోంది. అయితే నిజానికి ఇది ఎలాంటి ప్రకృతి విపత్తు గానీ, ప్రమాదకరమైన ఘటన గానీ కాదు. కొన్ని సందర్భాల్లో సముద్రంలో రెడ్ ఆల్గీ లేదా ప్లాంక్టన్ అధికంగా పెరగడం వల్ల నీరు ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది. ఈ ప్రక్రియను శాస్త్రీయంగా “రెడ్ టైడ్” అని పిలుస్తారు. సముద్రపు నీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటం, ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది సహజమైన ప్రక్రియే అయినప్పటికీ, కొన్నిసార్లు చేపలు, ఇతర సముద్ర జీవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ ఘటన ఇరాన్‌లోని హార్ముజ్ ద్వీపంలో చోటుచేసుకుంది. ఇటీవలి భారీ వర్షాల అనంతరం అక్కడి బీచ్‌లు, సముద్ర తీరాలు ఎరుపు లేదా రక్తం రంగులోకి మారాయి. చూడటానికి ఇది ఎంతో వింతగా, ఏదో మిస్టీరియస్ గ్రహాంతర ప్రదేశంలా కనిపించినప్పటికీ, ఈ రంగు పూర్తిగా సహజమైనదని, ఎలాంటి ప్రమాదం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హార్ముజ్ ద్వీపంలోని నేల మరియు పర్వతాలు ఐరన్ ఆక్సైడ్‌తో, ముఖ్యంగా హెమటైట్ అనే ఖనిజంతో సమృద్ధిగా ఉంటాయి.
హెమటైట్ (Fe₂O₃) అనే కెమికల్ కాంపౌండ్ భూమిపై ఎరుపు రంగును కలిగించే సహజ ఐరన్ ఆక్సైడ్. ఇది సాధారణంగా ఇనుము తుప్పు పట్టినప్పుడు కనిపించే లక్షణంతో సమానంగా ఉంటుంది. ఇదే ఖనిజం అంగారక గ్రహం (మార్స్) ఉపరితలంపై కనిపించే ఎరుపు రంగుకు కూడా కారణం. భారీ వర్షాలు పడినప్పుడు, నీరు ఇనుము అధికంగా ఉన్న పర్వతాలు మరియు నేల గుండా ప్రవహిస్తూ హెమటైట్ కణాలను కొట్టుకెళ్లి సముద్ర తీరానికి తీసుకువస్తుంది. ఫలితంగా సముద్రపు నీరు మరియు ఇసుక ఎరుపు రంగులోకి మారుతాయని నిపుణులు వివరిస్తున్నారు.
The scene in Hormuz Island, off Iran's coast, following heavy rainfall earlier today. pic.twitter.com/Wu6zxDUIkm
— Joe Truzman (@JoeTruzman) December 16, 2025
