China: చైనాలో వివాహాల సంఖ్య క్షీణించడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దీని ఫలితంగా జననాల రేటు కూడా తగ్గుతోంది. ఫలితంగా ఇది వృద్ధుల సంఖ్యను పెంచుతోంది. గత సంవత్సరం వివాహాలలో రికార్డు స్థాయిలో తగ్గుదల కనిపించింది. దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివాహ నమోదులలో 20% క్షీణత నమోదైందని, గత సంవత్సరంలో 7.68 మిలియన్ల వివాహాలు నమోదైతే, ప్రస్తుతం 6.1 మిలియన్ల జంటలు మాత్రమే వివాహం చేసుకున్నాయని నివేదించింది. దేశంలో తగ్గిపోతున్న జనాభాను పరిష్కరించడానికి, అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం వివాహాలను, పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తోంది.
విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన జనాభా శాస్త్రవేత్త యి ఫుక్సియన్ ఈ తగ్గుదలని ‘‘అపూర్వమైంది’’గా అభివర్ణించారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో వివాహాలు 12.2 శాతం మాత్రమే తగ్గాయని హైలెట్ చేశారు. 2013లో నమోదైన 13.47 మిలియన్ల వివాహాలతో పోలిస్తే గతేడాది చైనాలో వివాహాల సంఖ్య సగం కన్నా తక్కువగా నమోదైనట్లు గుర్తించారు.
Read Also: WhatsApp Marriage: ఇంటర్ స్టూడెంట్స్.. “వాట్సాప్‌లో పెళ్లి”.. పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా..
ఇదే విధంగా వివాహాల్లో క్షీణత, జననాల రేటు తగ్గితే చైనా రాజకీయ, ఆర్థిక ఆశయాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాలో వృద్ధ జనాభా వేగంగా పెరుగుతోంది. దాదాపుగా 30 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు. ఇది అమెరికా జనాభాకు సమానం. 1980-2015 వరకు చైనాలో అమలులో ఉన్న ఒకే బిడ్డ విధానం, వేగవంతమైన పట్టణీకరణ జననరేటుని తగ్గించింది. ప్రస్తుతం ఈ సమస్యని పరిష్కరించడానికి అధికారులు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకునే వారికి, పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. గతేడాది చైనా అధికారులు కాలేజ్‌లు, స్కూళ్లలో వివాహం, ప్రేమ, సంతానోత్పత్తి, కుటుంబ వ్యవస్థని ప్రోత్సహించడానికి ‘‘లవ్ ఎడ్యుకేషన్’’ని ప్రవేశపెట్టారు.
ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, చైనాలో జననాల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. గతేడాది 2.6 మిలియన్ల జంటలు విడాకులు కోరారు. ఇది కూడా జననాల రేటును ప్రభావితం చేస్తోంది. 2023 నుంచి పోలిస్తే 1.1 శాతం పెరిగింది. యువతలో వివాహం, పిల్లల్ని కనడం, కుటుంబ విలువను ప్రోత్సహించడంలో అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.