Reason Revealed Behind Why Indian Man Killed Australian Woman: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ అయిన ఓ భారతీయ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే! 2018లో క్వీన్స్‌లాండ్‌లోని వంగెట్టి బీచ్‌లో టోయా కార్డింగ్లే అనే యువతిని రజ్వీందర్ సింగ్ అనే భారతీయుడు దారుణంగా చంపి భారత్‌కి పారిపోయాడు. అప్పట్నుంచి అతని కోసం ఆస్ట్రేలియా పోలీసులు గాలిస్తున్నారు. భారత్‌కి పారిపోయాడన్న విషయం తెలిసి, అతని పట్టించడంలో సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆస్ట్రేలియా కోరింది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతడు ఆ అమ్మాయిని ఎందుకు చంపాడన్న మిస్టరీని రివీల్ చేశాడు.
ఇన్నిస్ ఫాయిల్‌లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేసే రజ్వీందర్.. హత్య జరిగిన రోజు తన భార్యతో గొడవ పడి, వంగెట్టి బీచ్ వద్దకు వెళ్లాడు. అక్కడ కాసేపు ప్రశాంతంగా సమయం గడుపుదామని అనుకున్నాడు. అయితే.. అదే సమయంలో టోయా కార్డింగ్లే (ఫార్మసీ వర్కర్) తన కుక్కతో బీచ్‌కు షికారుకి వచ్చింది. రజ్వీందర్ వద్దకు రాగానే.. ఆ కుక్క అతడ్ని చూసి అరవడం మొదలుపెట్టింది. అసలే భార్యతో గొడవపడినందుకు కోపంలో ఉన్న రజ్వీందర్.. ఆ కుక్క మొరవడంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు. తన కుక్కని కంట్రోల్‌లో పెట్టుకోమని, దాని యజమాని అయిన టోయాతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఆవేశంతో.. తన వద్ద ఉన్న కత్తితో పొడిచి, టోయాను చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఇసుకలో పూడ్చి.. కుక్కను ఒక చోట కట్టేసి.. అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. కేవలం కుక్క మొరిగిందన్న కారణంతో.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు రజ్వీందర్ సింగ్.
హత్య చేసిన రెండ్రోజుల తర్వాత.. అరెస్ట్ భయంతో రజ్వీందర్ సింగ్ తన భార్య, పిల్లల్ని వదిలేసి అక్కడి వదిలేసి భారత్‌కి పారిపోయి వచ్చాడు. పంజాబ్‌లో తలదాచుకున్నాడు. అతని అరెస్ట్ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇక్కడి ఇంటర్‌పోల్‌ను అప్రమత్తం చేసింది. పంజాబీ, హిందీ మాట్లాడే ఐదుగురు అధికారుల బృందాన్ని సిద్ధం చేశారు. అతడ్ని అరెస్ట్ చేయడం కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఈ నెల 21న అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫైనల్‌గా రజ్వీందర్ చేతికి చిక్కడంతో.. త్వరలోనే అతడిని క్వీన్స్‌లాండ్ పోలీసులకు అప్పగించనున్నారు.