Site icon NTV Telugu

Rajnath Singh: ‘డర్టీ’ పిక్చర్ వద్దు.. రష్యాకి రాజ్‌నాథ్ సూచన

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh Suggestions To Russia Over Dirty Bomb: డర్టీ బాంబ్(అణు బాంబ్)పై ఉక్రెయిన్, రష్యా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో.. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక సూచనలు చేశారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. ఇరు దేశాలూ పరస్పర దాడులకు అణ్వాయుధాలను ఆశ్రయించొద్దని అన్నారు. ఉక్రెయిన్‌తో ఉన్న వివాదాన్ని వీలైనంత త్వరగా చర్చలు లేదా దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని పరిస్థితుల్ని రాజ్‌నాథ్‌కి వివరించిన సెర్గీ.. ఉక్రెయిన్‌ తమ దేశంపై డర్టీబాంబ్‌ ప్రయోగించాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. అణు, రేడియోలాజికల్‌ ఆయుధాల వినియోగం మానవత్వపు ప్రాథమిక సిద్ధాంతానికి విరుద్ధమని, వాటి జోలికి వెళ్లొద్దని చెప్పారు. అలాగే.. భారత్‌, రష్యా మధ్య సైనిక సహకారంతో పాటు ఉక్రెయిన్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై కూడా ఇద్దరు చర్చించుకున్నట్టు కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.

కాగా.. ఐరోపాలోని అణువిద్యుత్ కేంద్రంలో రష్యా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! అయితే.. ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఉక్రెయినే డర్టీ బాంబ్ ప్రయోగించేందుకు రెడీ అవుతోందని రష్యా పేర్కొంది. తాము స్వాధీనం చేసుకున్న ఖేర్‌సన్ ప్రాంతంలో అణుబాంబు ప్రయోగించి.. ఆ నేరాన్ని తమ మీద మోపేందుకు ఉక్రెయిన్ కుట్ర పన్నుతోందని రష్యా చెప్పుకొచ్చింది. ఈ కుట్రను గుర్తించే తాము తమ బలగాల్ని ఖాళీ చేయిస్తున్నామని కూడా తెలిపింది. కానీ.. నాటో దేశాలు మాత్రం రష్యా ఆరోపణల్ని ఖండించాయి. రష్యా అనవసరమైన ఆరోపణలు చేస్తోందని, ఉక్రెయిన్‌పై తమ యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకే ఈ తప్పుడు ఆరోపణలకు దిగిందని పేర్కొన్నాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ కూడా మంగళవారం స్పందిస్తూ.. ఉక్రెయిన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే, రష్యా క్షమించరాని తప్పిదం చేసినట్లే అవుతుందని హెచ్చరించారు.

ఇదిలావుండగా.. క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ కూల్చేసినప్పటి నుంచి రష్యా ఆ దేశంపై భీకర దాడులకు దిగిన విషయం తెలిసిందే! ఆ తర్వాత ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ ‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై దాడికి దిగింది. రాజధాని కీవ్‌తో సహా, జపొరిజ్జియా, దినిప్రో, జటోమిర్ నగరాల్లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేసింది. ఈ దాడుల కారణంగా 30 శాతం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది.

Exit mobile version