Germany plane crash: ఇంటి పైకప్పుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి

  • జర్మనీలో శనివారం విషాదకర విమాన ప్రమాదం
  • ఇద్దరు వ్యక్తులు మృతి
  • విమానం ఎందుకు అదుపు తప్పిందనే అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు
Flight

Flight

వాయువ్య జర్మనీలో శనివారం విషాదకర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్న ప్రైవేట్ విమానం నివాస ప్రాంతంలోని ఇంటి పైకప్పుపై కూలిపోవడంతో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ప్రమాదం ఓల్డెన్‌బర్గ్ సమీపంలోని గాండర్‌క్సీ (Ganderkesee) ప్రాంతంలో జరిగింది. విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లి ఒక ఇంటి పైకప్పును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరూ బ్రెమెన్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. మృతుల వయస్సులు 65, 77 సంవత్సరాలు. తొలుత ఒకరు మరణించగా, మరొకరు కనిపించకుండా పోయినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం శిథిలాలను తొలగించి విస్తృతంగా గాలించిన తర్వాత రెండో వ్యక్తి మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు జర్మన్ విమానయాన దర్యాప్తు అధికారులు విచారణ ప్రారంభించారు. విమానం ఎందుకు అదుపు తప్పిందనే అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.