PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు

  • నెదర్లాండ్స్‌లో కొనసాగుతున్న ప్రధాని మోడీ
  • భారతీయులకు గుడ్‌న్యూస్
  • నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
Pm Modi6

Pm Modi6

ప్రధాని మోడీ నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రభుత్వ పెద్దలతో సమావేశమై రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. అలాగే రాజు, రాణితో కూడా భేటీ అయ్యారు.

ఇక భారత్‌కు గర్వకారణమైన అరుదైన చారిత్రక సంపద తిరిగి స్వదేశానికి తిరిగి రానుంది. 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి రాగి ఫలకాలను నెదర్లాండ్స్ భారత్‌కు తిరిగి అప్పగించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘ప్రతి భారతీయుడికి ఇది ఆనందకరమైన క్షణం. 11వ శతాబ్దానికి చెందిన చోళ రాగి ఫలకాలు నెదర్లాండ్స్ నుంచి భారత్‌కు తిరిగి రానున్నాయి.’’ అని పేర్కొన్నారు.

చోళుల వైభవానికి నిదర్శనం
ఈ చోళ రాగి ఫలకాలలో 21 పెద్ద ఫలకాలు, 3 చిన్న ఫలకాలు ఉన్నాయని మోడీ తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం ప్రపంచంలోని అత్యంత అందమైన భాషలలో ఒకటైన తమిళంలో రాసి ఉన్నాయని చెప్పారు. ఈ ఫలకాలు మహా చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుడు తన తండ్రి రాజరాజ చోళుడు ఇచ్చిన మౌఖిక హామీని అధికారికంగా నమోదు చేసిన చారిత్రక ఆధారాలని పేర్కొన్నారు. అలాగే చోళుల వైభవం, సంస్కృతి, సముద్రాధిపత్యాన్ని కూడా ఇవి ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

ధన్యవాదాలు
చోళుల సంస్కృతి, వారి సముద్ర వాణిజ్య శక్తిపై భారత్‌కు ఎంతో గర్వం ఉందని మోడీ అన్నారు. ఈ చారిత్రక సంపదను తిరిగి భారత్‌కు అప్పగించినందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వం, ముఖ్యంగా 19వ శతాబ్దం మధ్యకాలం నుంచి ఈ ఫలకాలను సంరక్షించిన లైడెన్ యూనివర్సిటీకి మోడీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాజు, రాణితో..
ఇక పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ రాజు విలెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాను రాజభవనంలో కలిశారు. ఈ సందర్భంగా భారత్-నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగినట్లు మోడీ వెల్లడించారు.

ఈ భేటీ అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘రాయల్ ప్యాలెస్‌లో రాజు విలెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను కలిశాను. సాంకేతికత, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, వాణిజ్యం, జల వనరులు వంటి కీలక రంగాల్లో భారత్-నెదర్లాండ్స్ స్నేహాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం ఆనందంగా అనిపించింది.’’ అని పేర్కొన్నారు.

అలాగే భారత్, నెదర్లాండ్స్ దేశాలు పరస్పర ప్రయోజనాలతో పాటు భవిష్యత్ తరాలకు అనుకూలమైన ప్రపంచ నిర్మాణం అనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని మోడీ తెలిపారు. ఇక మోడీ సమక్షంలో టాటా ఎలక్ట్రానిక్స్, ASML ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.