NTV Telugu Site icon

Iran: మెకానిక్‌ని లోపలికి లాక్కున్న విమానం ఇంజన్.. ఏం జరిగిందంటే..

Iran

Iran

Iran: ఓ విషాద ఘటనలో ఫ్లైట్ మెకానిక్ దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. విమానం జెట్ ఇంజన్ లాక్కోవడంతో మరణించారు. బోయింగ్ విమానం ఇంజన్‌ని చెక్ చేస్తున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. ఇరాన్‌లోని చబహార్ కోనారక్ విమానాశ్రయంలో ఫ్లైట్ మెకానిక్ అబోల్ ఫజల్ అమిరి బోయింగ్ ప్యాసింజర్ జెట్ ఇంజన్‌ని సాధారణ ప్రక్రియలో భాగంగా చెక్ చేశాడు. జూలై 3న ఉదయం 7.15 గంటలకు టెహ్రాన్ చేరుకున్న విమానం కుడి ఇంజన్‌ని తనిఖీ చేయడానికి కవర్ ప్లాప్స్ తెరిచి ఉంచారు. ఆ సమయంలో ఇంజన్ ఆన్ చేసి ఉంచారు. ఇంజన్ చుట్టూ అవసరమైన భద్రతా ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Read Also: Anant-Radhika wedding: పెళ్లికి వస్తూ లగేజీ పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్ జూలియా

అయినప్పటీకీ, అమిరి ఇంజిన్‌లో ఒక పరికరాన్ని మరిచిపోయానని తెలుసుకుని, మళ్లీ దాన్ని తీసుకురావడానికి ఇంజన్ వైపు వెళ్లాడు. వేగంగా తిరుగుతున్న జెట్ ఇంజన్ అమిరిని లాక్కుంది. అతను వేగంగా ఇంజన్ టర్బైన్‌లోకి లాక్కోబడ్డాడు. ఆ తర్వాత ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేశారు. అమిరి శరీరం జెట్ ఇంజన్‌లో పడి నుజ్జునుజ్జైంది. చివరకు అతని అవశేషాలను మాత్రమే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశీయ విమానయాన సంస్థ వారేష్ ఎయిర్‌లైన్స్ విమానం ఈ ఘటనకు కారణమైంది. దీనిపై దర్యాప్తు చేయాలని ఇరాన్ ఏవియేషన్ అథారిటీ ఆదేశించింది.

Show comments