NTV Telugu Site icon

Plane Crash In Montgomery: విమానం కుప్పకూలింది.. 90 వేల ఇళ్లకు పవర్ పోయింది

Plane Crash In Power Lines

Plane Crash In Power Lines

Plane crashes into power lines in Montgomery County in US: అమెరికా మేరీలాండ్‌లోని మాంట్‌గోమెరీ కౌంటీలో ఓ చిన్న సైజు విమానం కుప్పకూలిన సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి విద్యుత్ లైన్లపైకి ఆ విమానం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు కానీ.. కరెంటు తీగలు తెగిపోవడంతో, కౌంటీలోని 90 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా.. కౌంటీవాసులంతా పవర్ లేకుండానే రాత్రంతా గడపాల్సి వచ్చింది. 10 అంతస్తుల ఎత్తులోనే విమానం కుప్పకూలింది కాబట్టి, ఈ ప్రమాదం ఎల సంభవించిందో ఇప్పుడే కచ్ఛితంగా చెప్పలేమని అధికారులు తెలిపారు. వర్షాలు పడుతున్నాయి కాబట్టి, వాతావరణ పరిస్థితులు ఏమంత బాగోలేదని.. ఈ ప్రమాదం జరగడానికి అదే కారణం అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ సాగుతోందని పేర్కొన్నారు.

మరోవైపు.. ఆ ప్లేన్‌లో ఉన్న ఒక పైలట్, ప్యాసింజర్‌ని రెస్క్యూ బృందం కాపాడింది. 100 అడుగుల ఎత్తులో ఒక పవర్ పోల్‌‌లో ప్లేన్ ఇరుక్కుపోవడంతో.. ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టమైంది. దాదాపు ఏడు గంటలపాటు కష్టపడి, ఆ ఇద్దరిని కాపాడగలిగారు. పైలట్ పాట్రిక్ మర్కల్ (65) వాషింగ్టన్ డీసీకి చెందినవాడు కాగా.. ప్యాసింజర్ జాన్ విలియమ్సన్ (66) లూసియానాకు చెందినవాడుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వారికి గాయాలు కావడంతో.. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందుకున్న ఆ ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. సెల్‌ఫోన్ ద్వారా విమానంలో ఉన్న ఆ ఇద్దరిని కాంటాక్ట్ చేసి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలిస్తూ వచ్చామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు.. ఇక ఈ ప్రమాదంపై మాంట్‌గోమెరీ పోలీసులు ట్వీట్ చేస్తూ.. విమానం విద్యుత్‌ లైన్లపైకి దూసుకెళ్లిన కారణంగా, ఆ ప్రాంతంలో కరెంటు తీగలు నేలపై పడి ఉన్నాయని, కావున ఆ ప్రాంతంవైపు వెళ్లొద్దని సూచించారు.