UFO Files: విశ్వంలో మనమే కాకుండా వేరే గ్రహాంతర వాసులు ఉన్నారా? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే వింత వస్తువులు (UFO) నిజమేనా? దశాబ్దాలుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దిశగా అమెరికా కీలక అడుగు వేసింది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ‘పెంటగాన్’ చరిత్రలో మొదటిసారిగా గ్రహాంతర వాసులు, అపరిచిత ఎగిరే వస్తువులకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను బహిర్గతం చేసింది.
ట్రంప్ ఆదేశంతో బయటకు వచ్చిన ఫైళ్లు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు పెంటగాన్ ప్రస్తుతం 161 రహస్య ఫైళ్లను ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఏలియన్లు, UFOల పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ పారదర్శక నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఫైళ్లలో దశాబ్దాల కాలం నాటి సైనిక రికార్డులు, అంతరిక్ష మిషన్ల నివేదికలు, సామాన్యుల నుంచి సైనికుల వరకు అందించిన ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. ఈ పత్రాల్లో ముఖ్యంగా 1960, 70వ దశకాల్లో జరిగిన అపోలో మిషన్లకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగుచూశాయి. చంద్రుడిపై అడుగు పెట్టిన రెండో వ్యక్తి బజ్ ఆల్డ్రిన్.. అంతరిక్ష యాత్రలో ఒక వింత కాంతిని చూసినట్లు అప్పట్లోనే వెల్లడించారు.
వ్యోమగామి ఎలన్ బీన్ అంతరిక్షంలో మెరిసే కణాలు, ఫ్లాషింగ్ లైట్లను గమనించినట్లు పేర్కొన్నారు. అవి చంద్రుడి నుంచి బయటకు వస్తున్నట్లు అనిపించాయని ఆయన వెల్లడించారు. అంతరిక్ష వ్యోమగామి ఫ్రాంక్ బోర్మాన్ తన స్పేస్ క్రాఫ్ట్ దగ్గర ఒక అపరిచిత వస్తువుతో పాటు లక్షలాది మెరిసే కణాలను చూసినట్లు ఆడియో రికార్డింగ్ ద్వారా స్పష్టం చేశారు. సామాన్యుల వాంగ్మూలాలతో పాటు, ఇరాక్, సిరియా, యూఏఈ వంటి దేశాలలో అమెరికా సైన్యం రికార్డ్ చేసిన కొన్ని వీడియోలను కూడా పెంటగాన్ విడుదల చేసింది. వీటిలో ఒక అండాకారపు (Oval shape) వస్తువు అత్యంత వేగంగా వెళ్లడం కనిపించింది. దీనిని అధికారులు ‘సంభావ్య క్షిపణి’గా పేర్కొన్నప్పటికీ, అది వింతగా ఉందని అంగీకరించారు.
అమెరికాలో రాజకీయ దుమారం
ఈ పత్రాల విడుదల తర్వాత అమెరికా రాజకీయాల్లో చర్చ మొదలైంది. రిపబ్లికన్ నేతలు దీనిని ‘పారదర్శకతకు నిదర్శనం’ అని కొనియాడుతుండగా.. డెమోక్రటిక్ నేతలు మాత్రం అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ట్రంప్ ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి సాక్ష్యాలు, రికార్డులు మాత్రమేనని, వీటిని ఏలియన్ల ఉనికికి పక్కా ఆధారాలుగా భావించలేమని అధికారులు స్పష్టం చేశారు.
