NTV Telugu Site icon

Female Doctor: “మహిళా వైద్యులు” చికిత్స అందిస్తే రోగులు బతికే అవకాశం ఎక్కువ..

Female Doctor

Female Doctor

Female Doctor: మహిళా డాక్టర్లు వైద్యం అందించి రోగులు చనిపోవడం తగ్గి, బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. పురుష వైద్యులు చికిత్స అందించిన రోగులతో పోలిస్తే మహిళా వైద్యుల చికిత్సలో మరణాల రేటు తగ్గిందని తేలింది. ఈ అధ్యయనం 2016 నుండి 2019 వరకు వివిధ వైద్య పరిస్థితుల కారణంగా ఆస్పత్రిల్లో చేరిన 4,58,100 మంది మహిళా రోగులు మరియు 3,18,800 కంటే ఎక్కువ మంది మగ రోగులతో సహా 7,76,000 మందిపై అధ్యయన చేసింది.

మహిళా వైద్యులు చికిత్స చేసిన రోగుల్లో మరణాలు తక్కువగా ఉన్నట్లు, త్వరగా కోలుకున్నట్లు అధ్యయనం తేల్చింది. మహిళా వైద్యులతో చికిత్స పొందిన స్త్రీ పెషెంట్లలో మరణాల రేటు 8.15 శాతం ఉండగా.. పురుష వైద్యులు చికిత్స చేసినప్పుడు 8.38 శాతంగా ఉంది. ఇదే విధంగా లేడీ డాక్టర్లు చికిత్స చేసిన మగ రోగుల్లో మరణాల రేటు 10.15 శాతం ఉండగా.. పురుష వైద్యుల వైద్యంలో 10.23 శాతంగా ఉంది.

Read Also: Boeing 737: టేకాఫ్ సమయంలో ల్యాండిగ్ గేర్ చక్రాన్ని కోల్పోయిన విమానం.. వీడియో వైరల్..

మహిళా వైద్యలు తమ పేషెంట్ల పట్ల ఎక్కువ సంరక్షణ అందిస్తారని ముఖ్యమైన విషయమని, అందువల్ల వీరి పర్యవేక్షణలో ఉన్న రోగులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతోందని పరిశోధకుడైన యుసుకు సుగావా తెలిపారు. మహిళా వైద్యులు రోగులతో మాట్లాడటం, వారి రికార్డులు చూడటం వంటి ప్రక్రియలకు ఎక్కువ సమయం కేటాయిస్తారని, మెరుగైన సంభాషణ కలిగి ఉంటారని స్టడీలో తేలింది. మహిళా వైద్యులచే చికిత్స పొందడం, ముఖ్యంగా సున్నితమైన పరీక్షల సమయంలో మహిళారోగులకు కలిగే ఇబ్బంది, అసౌకర్యం తగ్గుతుందని పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా మహిళా వైద్యులు తమ పేషెంట్లతో ఎక్కువ సమయం గడుపుతారని తేలింది. 2002 నుండి జరిగిన ఒక ప్రత్యేక అధ్యయనంలో మహిళా వైద్యులు సగటున 23 నిమిషాలు రోగితో గడిపారని, పురుష వైద్యులు 21 నిమిషాలు గడిపారని కనుగొన్నారు.