పానీ పూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..? అసలు ఆ పేరు ప్రస్తావిస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇక ఎక్కడైన బండి కనిపిస్తే చాలు.. లగెత్తుకుని వెళ్లి పానీ పూరీ సేవించేస్తారు. ముఖ్యంగా.. సాయంత్రం వేళ్ల ప్రతిఒక్కరూ దీనిని ఎంతో ఇష్టంగా స్నాక్స్‌గా తీసుకుంటారు. అలాంటి పానీ పూరీని ఒక చోట బ్యాన్ చేసేశారు. అదే.. నేపాల్‌లోని ఖాట్మండు వ్యాలీలో! అక్కడ పానీ పూరీ అమ్మకాల్ని నిషేధిస్తున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. పానీ పూరీలో ఉపయోగించే నీటిలో.. కలరా బ్యాక్టీరియా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పానీ పూరీ అమ్మకాలను నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు.
కొంతకాలం నుంచి లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులో గణనీయంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం నేపాల్ దేశంలో కలరా రోగుల సంఖ్య 12కు చేరుకుంది. దీంతో.. కలరా వ్యాప్తికి గల కారణాలేంటో పరిశీలించగా, పానీ పూరీ నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ఈ క్రమంలోనే కలరా వ్యాప్తిని అరికట్టేందుకు మహానగరాల్లో, కారిడార్ వంటి ప్రాంతాల్లో పానీ పూరీ విక్రయాలను నిషేధించారు. అంతేకాదు ఎవరికైన కరోనా లక్షణాలున్నట్టు కనిపిస్తే, సమీప ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని అధికారులు కోరారు. డయేరియా, కలరా వంటివి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కాబట్టి.. అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది.
