Pakistani Army Helicopter Crashed In Balochistan: వరద బాధితులకు సహాయం అందించేందుకు బయలుదేరిన పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ కుప్పకూలినట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్‌లోని సాసీ పన్ను మందిరం, విందార్ ప్రాంతాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ హెలికాప్టర్ కుప్పకూలిందన్న విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అది అదృశ్యమైందని మాత్రమే నిర్ధారించారు.
బలూచిస్తాన్‌లోని లాస్బెలాలో వరద సహాయక చర్యల్లో ఉన్న ఈ హెలికాప్టర్‌తో సంబంధాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ ఆర్మీ ఓ ట్వీట్‌లో తెలిపింది. అందులో 12 సైనిక దళాల కమాండర్‌తో పాటు ఆరుగురు సీనియర్ అధికారులు ఉన్నట్టు పాక్ ఆర్మీ పేర్కొంది. ప్రస్తుతం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. లాస్బెల్లా ప్రాంతంలో నివసిస్తోన్న ప్రజల నుంచి స్థానిక పోలీస్ అధికారికి ఓ హెలికాప్టర్ క్రాష్ అయ్యిందని సమాచారం అందినట్టు తెలిసింది. అప్పుడు వెంటనే ఓ పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకుందని, కానీ అక్కడ సర్వైవర్స్ కనిపించలేదని తేలింది.
ఇదిలావుండగా.. ఉత్తర పాకిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్ని కొన్ని రోజుల నుంచి వరదల ముంచెత్తుతున్నాయి. ఉత్తర పాకిస్తాన్‌లోని రెండు ప్రావిన్సుల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరడంతో.. మంచు పర్వతాలు కరిగి వరదగా మారాయి. రాళ్లు, బురదతో కూడిన వరదలు.. దారిలో ఏముంటే వాటిని తుడిచిపెట్టేస్తున్నాయి. ఈ వరదల కారణంగా కొన్ని ప్రాణాలు పోగా, చాలా మంది రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలోనే వారిని ఆదుకునేందుకు పాక్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కానీ, ఇంతలో హెలికాప్టర్ కుప్పకూలిపోయిన సంఘటన వెలుగు చూసింది.
