Pakistan Terror Attack: పాకిస్థాన్‌లోని అశాంతి నిలయమైన ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రదాడి జరిగింది. బన్నూ జిల్లాలోని ఫతేఖేల్ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని శనివారం జరిగిన భారీ ఆత్మాహుతి దాడిలో సుమారుగా ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. పేలుడు ధాటికి సమీపంలోని నివాస గృహాలు కుప్పకూలడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తుంది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. అయితే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ వాహనం లక్ష్యాన్ని చేరకముందే దానిని గుర్తించి ధ్వంసం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
పేలుడు జరిగిన వెంటనే డజన్ల కొద్దీ సాయుధ ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. దీంతో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య గంటల తరబడి కాల్పులు జరిగాయి. ఈ భీకర పోరాటంలోనే ముగ్గురు పోలీసులు వీరమరణం పొందారని తెలుస్తుంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడిని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి ముహమ్మద్ సోహైల్ అఫ్రిది తీవ్రంగా ఖండించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. “ఉగ్రవాదంపై పోరాటం కేవలం ఒక ప్రాంతానిది కాదు, ఇది దేశం మొత్తానిది. బలవంతంగా రుద్దిన కొన్ని తప్పుడు విధానాల వల్లే దేశం నేడు అభద్రతా ఊబిలోకి నెట్టబడింది. మన పోలీసుల త్యాగాలను వృథా కానివ్వం” అని అఫ్రిది స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడి తీవ్రతకు పోలీస్ స్టేషన్ పరిసరాల్లోని నివాస గృహాల పైకప్పులు కూలిపోయాయి. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
