Pakistan: పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో మహ్మద్ ప్రవక్త, ఖురాన్, ఇస్లాంని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే దాన్ని దైవదూషణగా పరిగణిస్తుంటారు. దైవదూషణకు పాల్పడిన వ్యక్తులకు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. వాట్సాప్ సందేశాల ద్వారా దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ల విద్యార్థికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. మరో 17 ఏళ్ల యువకుడికి జీవిత ఖైదు విధించింది. మహ్మద్ ప్రవక్త, అతని భార్యలను గురించి కించపరిచే పదాలను కలిగి ఉన్న ఫోటోలు, వీడియోలను తయారు చేసినందుకు 22 ఏళ్ల యువకుడికి మరణశిక్ష విధించినట్లు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కోర్టు న్యాయమూర్తులు తెలిపారు. ముస్లింల మతపరమైన భావాలను కించపరిచే ఉద్దేశ్యంతో విద్యార్థి దైవదూషణ కంటెంట్‌ని షేర్ చేశాడని కోర్టు పేర్కొంది.
Read Also: Amit Shah: రాహుల్‌ని ప్రధాని చేయడమే సోనియాగాంధీ లక్ష్యం.. కాంగ్రెస్ పేదలకు చేసిందేం లేదు..
ఈ విషయాన్ని పంచుకున్నందుకు మరో యువకుడికి జీవిత ఖైదు విధించింది. అయితే, ఇద్దరూ కూడా తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు. లాహోర్‌లోని పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) సైబర్ క్రైమ్ యూనిట్ 2022లో ఇద్దరిపై కేసు నమోదు చేసింది. మూడు వేర్వేరు మొబైల్ నంబర్ల నుంచి దైవదూషణతో కూడిన వీడియోలు, ఫోటోలు తమకు వచ్చాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. అతని ఫోన్‌ని పరిశీలించిన తర్వాత ఓ వ్యక్తికి అసభ్యకరమైన మెటీరియల్ పంపినట్లు దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. అయితే, తమ కుమారుడిపై కోర్టు తీర్పును లాహోర్ హైకోర్టులో అప్పీల్ చేస్తామని 22 ఏళ్ల విద్యార్థి తండ్రి చెప్పాడు.
పాకిస్తాన్‌లో దైవదూషణ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దైవదూషణ చేశాడనే అనుమానం వచ్చిన వ్యక్తుల్ని కొట్టి చంపడం, కాల్చివేసిన ఘటనలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో పనిచేస్తున్న ఓ శ్రీలంక జాతీయుడిని ఇలాగే అక్కడి ప్రజలు సజీవ దహనం చేశారు. ఇటీవల ఓ యువతి అరబిక్ పదాలు ఉన్న దుస్తులు ధరిస్తే, దైవదూషణ చేసిందనే అనుమానంతో ఆమెను చంపేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులు సాయంతో ఆమె అక్కడ నుంచి బయటపడింది. అయితే, ఈ దుస్తుల్ని తయారు చేసిన కువైట్ సంస్థ, పాకిస్తాన్ ప్రజల తీరును తప్పుపట్టింది. ఆ పదాలకు అర్థాలు తెలియక ఇలాంటి పనులు చేయడం గురించి తీవ్రంగా హెచ్చరించింది.
