Site icon NTV Telugu

Shehbaz Sharif: అన్నింటికీ పాకిస్థాన్ సిద్ధంగా ఉంది.. పాక్ ప్రధాని ప్రకటన

Shehbazsharif

Shehbazsharif

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఖైబర్-పఖ్తుంఖ్వాలోని కాకుల్‌లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. పహల్గామ్ దాడిపై (తటస్థ దర్యాప్తు) విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

పహల్గామ్ దాడి తర్వాత తమపై నిందలు మోపుతున్నారని వ్యాఖ్యానించారు. దీనికి ముగింపు పలకాలన్నారు. బాధ్యతాయుతమైన దేశంగా తమ పాత్రను పోషిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఏదేమైనా తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూనే.. భారత్ నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడి చేసింది తామేనని ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. ఈ సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా పని చేస్తోంది. ఈ దాడి అంతా లష్కరే తోయిబా కనుసన్నల్లోనే జరిగినట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

ఇక పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలను రద్దు చేసింది. ఏప్రిల్ 29లోపు అన్ని రకాల వీసాదారులైన పాకిస్థానీయులు వెళ్లిపోవాలని సూచించింది. అంతేకాకుండా అటారీ-వాఘా సరిహద్దును కూడా మూసివేసింది. ఇలా ఒక్కొక్కటిగా కఠిన చర్యల దిశగా భారత్ అడుగులు వేస్తోంది.

Exit mobile version