Pakistan LPG Crisis: దాయాది దేశం పాకిస్తాన్ మరో సంక్షోభంతో సతమతం అవుతోంది. ఆ దేశంలో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. ఇరాన్‌తో కీలక సరిహద్దు మార్గాలను మూసేయడంతో దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో 12 కిలోల గ్యాస్ సిలిండర్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ. 8200కు చేరింది. (భారత కరెన్సీలో ఇది రూ. 2700 సుమారుగా) చలికాలం సమీపిస్తుండటంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడబోతోంది.
సరిహద్దు మూసివేత..
2026 అక్టోబర్ 17న పాకిస్తాన్-ఇరాన్ మధ్య ఉన్న గబ్ద్–రిమ్దాన్, తాఫ్తాన్ సరిహద్దు మార్గాలను మూసివేశారు. బలూచిస్తాన్‌లో తిరుగుబాటు నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అక్రమ రవాణా నియంత్రణ కోసం సరిహద్దుల్ని మూసేసింది. అమెరికా ఒత్తిడి, ఆంక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. సరిహద్దు మూసేయడంతో ఎల్పీజీ రవాణా దెబ్బతింది. వందలాది ట్యాంకర్లు సరిహద్దులకు ఇరువైపుల నిలిచిపోయాయి. 4500 మెట్రిక్ టన్నులకు పైగా గ్యాస్ ఇరాన్ వైపు నిలిచిపోయినట్లు సమాచారం.
రూ. 4500 నుంచి రూ. 8200కు పెరిగింది.
సరిహద్దు మూసేయడంతో గతంలో 12 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 4500 ఉండగా, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రూ. 7000 నుంచి రూ. 8000 వరకు పెరిగింది. లాహోర్‌లో సుమారు రూ. 7500 ఉంటే, స్కార్దూ లో ఇది రూ. 8200కు చేరింది. పాకిస్తాన్ తన గ్యాస్ దిగుమతుల్లో 70 శాతం ఇరాన్‌పైనే ఆధారపడుతోంది. రాబోయే చలికాలం కావడంతో గ్యాస్ డిమాండ్ మరింత పెరుగుతోంది. దీంతో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

