Pakistan: సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతిస్తున్నాయంటూ ఖండించింది. బీజేపీ నాయకులు ముస్లింలను బాధపెట్టే ఇటువంటి పదేపదే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఆపడానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. గత మూడు నెలల్లో బీజేపీ సీనియర్ నాయకుడు ప్రవక్తపై అగౌరవంగా వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి అని ఇక్కడి విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
“ఈ అత్యంత అవమానకరమైన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది ముస్లింల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి” అని ప్రకటనలో పేర్కొంది. రాజా సింగ్‌పై బీజేపీ తీసుకున్న క్రమశిక్షణ చర్యలు ప్రపంచంలో ఉన్న ముస్లింల బాధ, వేదనను తగ్గించలేవని వెల్లడించింది. ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారని విమర్శించింది. అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే సింగ్ బెయిల్‌పై విడుదల కావడం అత్యంత ఖండనీయమని ఆ ప్రకటనలో పేర్కొంది.తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజాసింగ్‌ను బీజేపీ నుంచి పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ రాజ్యాంగానికి, నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినందుకు ఈ చర్యలు తీసుకుంది.
Tejaswi Yadav: బీజేపీకి ముగ్గురు అల్లుళ్లు.. సీబీఐ, ఈడీ, ఐటీ
మూడు నెలల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. అప్పట్లో బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆమెను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. ఇస్లామిక్ దేశాలు నుపుర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. వివాదాస్పద ట్వీట్ చేసినందుకు ఢిల్లీ మీడియా ఇన్‌ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ బహిష్కరించింది.
