Pakistan: పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా పాకిస్థాన్‌లో 5.7 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని ది న్యూస్ ఇంటర్నేషనల్ తెలిపింది. పాక్‌లో రెస్క్యూ, రిలీఫ్, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కురిసిన వర్షాలకు దాయాది దేశం అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా ఇప్పటివరకు 1033 మంది మరణించారని.. 1,527 మంది గాయపడ్డారని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(NDMA) వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోనే 119 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో జూన్ 14 నుంచి భీకర వర్షాలు కురుస్తున్నాయి. జూన్ నుంచి వేలాది మంది గాయపడడంతో పాటు నిరాశ్రయులయ్యారు. ప్రధానంగా దక్షిణ, నైరుతి పాకిస్థాన్‌లో తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.
వరదల కారణంగా 3,451.5 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. 147 వంతెనలు దెబ్బతిన్నాయి. 170 దుకాణాలు నేలమట్టమయ్యాయి. 9.49 లక్షల ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎంతమేరకు ఆర్థిక నష్టం వాటిల్లందనేదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. రూ.వందల కోట్ల నష్టం వాటినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలని పాక్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ వర్షాలకు పాక్‌లో 149 వంతెనలు కొట్టుకుపోగా, 6,82,139 ఇళ్లు దెబ్బతిన్నాయని ఎన్‌డీఎంఏ తెలిపింది. 110 జిల్లాల్లోని 57 లక్షలమందికి ఆహారం అందడం లేదని వివరించింది. ఇదిలా ఉంటే, ప్రతికూల వాతావరణం కారణంగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు విమాన రాకపోకలను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ నిలిపివేసింది. ఈ విపత్తు కారణంగా సుమారు 719,558 పశువులు మృత్యువాత పడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వరదల వినాశకరమైన ప్రభావాన్ని ఎదుర్కోవటానికి దేశ ప్రభుత్వం విరాళాల కోసం విజ్ఞప్తులు చేసింది. కాగా కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌ను ఆదుకునేందుకు ఖతార్, ఇరాన్ సహా కొన్ని దేశాలు ముందుకొచ్చాయి. అత్యవసర సహాయాన్ని అందిస్తామని ప్రకటించాయి. వరదలు పాకిస్తాన్‌లోని వ్యవసాయ భూమి, మౌలిక సదుపాయాలపై కూడా ప్రభావం చూపాయి. ప్రావిన్సులు అంతటా 949,858 గృహాలు దెబ్బతిన్నాయి. మొత్తంగా, 662,446 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 287,412 పూర్తిగా ధ్వంసమయ్యాయి.
drown in Yamuna river: యమునా నదిలో పడి ఐదుగురు యువకులు మృతి
జియో న్యూస్ ప్రకారం, పాకిస్తాన్‌లోని కనీసం 110 జిల్లాలు వరదలతో దెబ్బతిన్నాయి, వాటిలో 72 జిల్లాలు విపత్తు బారిన పడ్డాయి. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యంతో పాకిస్థాన్ సతమతమవుతోంది. వరదలు లక్షలాది ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి, ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం “జాతీయ అత్యవసర పరిస్థితి” ప్రకటించింది. పాకిస్తాన్ యొక్క 30 సంవత్సరాల సగటు ప్రకారం దేశంలో 134 మిమీ వర్షం కురిసిందని, ఈ సంవత్సరం 388.7 మిమీ వర్షం కురిసిందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. సగటు కంటే 190.07 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది.
