పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడి జాతీయ అసెంబ్లీని… రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ చేస్తోన్న ప్రయత్నాలు సాఫీగా సాగేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతుండగా.. వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లుగా వచ్చే 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమేనని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ చెబుతోంది. ముఖ్యంగా న్యాయపరమైన, రాజ్యాంగ అంశాలతోపాటు ఎన్నికల ఏర్పాట్లలో ఎదురయ్యే సవాళ్ల కారణంగా ఇవి సాధ్యం కాకపోవచ్చని స్పష్టం చేసింది.
Read Also: XE Variant: భారత్‌లో కొత్త రకం కరోనా.. లక్షణాలు ఏంటి..?
తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించిన వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఇమ్రాన్ ఖాన్ విపక్షాలకు షాక్ ఇచ్చారు. అంతేకాకుండా మూడు నెలల్లోనే ఎన్నికలు జరుపుతామని వెల్లడించారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నప్పటికీ ఇందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా లేదని తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన తోపాటు జిల్లా-నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ప్రధాన సవాళ్లని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం ఆరు నెలల సమయం అవసరమని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
