North Korea: ఉత్తర కొరియా తన పక్కనున్న దేశంతో యుద్ధానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా గురువారం సెంట్రల్ మిటలరీ కమిషన్ సమావేశాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సైనిక జనరల్‌ను తొలగించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియామించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియా సరి కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టడంతోపాటు, దళాలను సిద్ధం చేయాలని కిమ్ సైన్యాన్ని ఆదేశించినట్లు ఆదేశ మీడియా సంస్థ ప్రకటించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్లు ఆ దేశ వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఓ కీలక సైనిక జనరల్‌ను తొలగించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్లు వెల్లడించింది. ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని, సైనిక సన్నాహాలను వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిపింది. శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని సైనికాధికారులను ఆదేశించినట్లు ప్రకటించింది.
Read also: Russia: ఇస్రోతో రోస్కోస్మోస్ పోటీ.. చంద్రయాన్‌కు పోటీగా రష్యా లూనా-25
ఉత్తర కొరియా సైనిక జనరల్‌గా ఉన్న పాక్-సు-ఇల్ స్థానంలో కొత్త జనరల్‌గా రి యాంగ్ గిల్‌ను నియమిస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికా, దక్షిణ కొరియా చేపట్టబోయే సంయుక్త సైనిక విన్యాసాలపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియాలో తయారైన కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని, సైనిక దళాలను సిద్ధం చేయాలని సైన్యాన్ని కిమ్ జోంగ్ ఆదేశించినట్లు తెలిపింది. గతవారమే ఆయుధ కర్మాగారాలను సందర్శించిన కిమ్.. క్రూజ్ క్షిపణి ఇంజిన్లు, మానవరహిత గగనతల వాహనాల (UAV) నిర్మాణలను త్వరితం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ దాడులకు ఉపయోగించే రాకెట్లను, కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణినీ కిమ్ పరిశీలించారు. వాటితోపాటు ఆయుధ కర్మాగారాల్లో రైఫిళ్ల పనితీరును కిమ్ స్వయంగా పరిశీలించిన ఫొటోలను ఆ దేశ మీడియా బయటికి విడుదల చేసింది.
