North Korea Fires 2 Missiles: ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగాల్లో తగ్గేది లేదంటోంది. బుధవారం వరసగా రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. రెండు రోజుల క్రితం ప్యాంగాంగ్ నుంచి చివరి సారిగా క్షిపణి ప్రయోగం చేసిన నార్త్ కొరియా.. బుధవారం మరో రెండు క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా ధృవీకరించింది. ప్యాంగాంగ్ లోని సునాన్ ప్రాంతం నుంచి ఈ రెండు క్షిపణల్ని ప్రయోగించింది నార్త్ కొరియా.
ఉత్తర కొరియా గత ఆదివారం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మూడు రోజుల వ్యవధిలో మరో రెండు బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ విషయాన్ని జపాన్ కోస్ట్ గార్డు, దక్షిణ కొరియా ఆర్మీ నిర్థారించాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దక్షిణ కొరియా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కిమ్ వరసగా క్షిపణి ప్రయోగాలను చేపడుతున్నారు. ఇలా క్షిపణులతో కమలా హారిస్ కు స్వాగతం చెబుతున్నాడు.
Read Also: IND Vs SA 1st T20: విజృంభించిన టీమిండియా బౌలర్లు.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు
దక్షిణ కొరియా పర్యటన కోసం యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం సియోల్ చేరుకోనున్నారు. దీనికి ప్రతిస్పందనగానే నార్త్ కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా మిత్రదేశం అయిన సౌత్ కొరియాను నార్త్ కొరియా నుంచి రక్షించేందుకు 28,500 మంది సైనికులు ఆ దేశంలో ఉన్నారు.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అణు పరీక్షలకు సిద్ధం అవుతున్నారని.. దక్షిణ కొరియా, అమెరికా నెలల ముందు నుంచే హెచ్చరిస్తున్నాయి. ఉత్తర కొరియా తన పుంగ్గే-రి అణు ప్రదేశంలో మూడవ సొరంగాన్ని కూడా పూర్తి చేసినట్లు అమెరికా, సౌత్ కొరియా గుర్తించింది. అక్టోబర్ 16 చైనా సీపీసీ సమావేశాలు, అమెరికాలో మధ్యంతర ఎన్నికల సమయంలో అణుపరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర కొరియా ప్లాన్ చేస్తోంది.
