వైద్య రంగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా గెలుచుకున్నారు. మెదడులోని నాడీకణాల (నర్వ్ సెల్స్) కార్యకలాపాలను కాంతి ద్వారా నియంత్రించేందుకు దోహదపడిన కీలక పరిశోధనలకు గాను కార్ల్ డైసెరోత్, పీటర్ హెగెమన్, జార్జ్ నాగెల్‌లకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు. కాంతి ప్రభావంతో అయాన్ ఛానళ్లను నియంత్రించే విధానం, ఆప్టోజెనెటిక్స్ (Optogenetics) అభివృద్ధికి దారితీసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ ముగ్గురికి అవార్డు లభించింది. ఈ సాంకేతికత ద్వారా జీవించి ఉన్న మెదడులోని నిర్దిష్ట నాడీకణాల కార్యకలాపాలను కాంతి సహాయంతో ఆన్ లేదా ఆఫ్ చేయడం సాధ్యమవుతుంది. మెదడు ఎలా పనిచేస్తుంది, నాడీకణాలు పరస్పరం ఎలా స్పందిస్తాయి వంటి అంశాలను లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా ప్రయోగశాలల్లో ఉపయోగపడుతోందని నోబెల్ కమిటీ పేర్కొంది.
స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఉన్న కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం వైద్యశాస్త్ర నోబెల్ బహుమతిని ప్రకటించారు. దీంతో ఈ ఏడాది నోబెల్ అవార్డుల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నోబెల్ బహుమతి నగదు పురస్కారం 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు. ఇది సుమారు 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం. ఈ మొత్తం ఒక వ్యక్తికి, కొద్దిమంది విజేతలకు లేదా సంస్థకు అవార్డు లభించినా అదే విధంగా ఉంటుంది.
గత ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ బహుమతిని మేరీ ఈ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, డాక్టర్ షిమోన్ సకగుచి గెలుచుకున్నారు. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) హానికరమైన సూక్ష్మజీవులపై దాడి చేస్తూ.. మన స్వంత కణాలపై దాడి చేయకుండా ఎలా నియంత్రించబడుతుందనే అంశంపై వారు చేసిన పరిశోధనలకు ఈ అవార్డు లభించింది. పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ (Peripheral Immune Tolerance)గా పిలిచే ఈ ప్రక్రియపై వారి పరిశోధన.. టైప్-1 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులను అర్థం చేసుకోవడంలో కీలకమని నిపుణులు పేర్కొన్నారు.
వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి ప్రకటనతో నోబెల్ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య రంగాల్లో నోబెల్ బహుమతులను ప్రకటించనున్నారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు. అనంతరం అక్టోబర్ 12న ఆర్థికశాస్త్రంలో నోబెల్ మెమోరియల్ ప్రైజ్‌ను ప్రకటించనున్నారు.

