NTV Telugu Site icon

Nigeria: బోకో హరామ్ మారణ హోమం… 50 మంది రైతుల దారుణ హత్య

Boko Haram 1280x720

Boko Haram 1280x720

ఉగ్రవాద సంస్థ బోకోహారామ్ రెచ్చిపోయింది. అత్యంత పాశవికంగా మారణహోమానికి పాల్పడింది. నైజీరియా దేశంలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగింది. తమ సమాచారాన్ని నైజీరియా మిలటరీకి ఇస్తున్నారని ఈ దాడికి పాల్పడింది. దేశంలోని ఉత్తర ప్రాంతం కామెరూన్ దేశ సరిహద్దుల్లోని బోర్నో ప్రావిన్స్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో 50 మంది దాకా మరణించినట్లు సమాచారం. దాడిలో గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు… కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పంటపొలాల్లో పని చేస్తున్న దాదాపు 50 మంది దాకా కూలీలను, రైతులను బోకోహరామ్ తీవ్రవాదులు కాల్చి చంపారు. మోటర్ బైకులపై వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పొలాల్లో పనిచేస్తున్నారు. మరికొంతమంది కలప సేకరించేందుకు వెళ్లడంతో బతికిపోయారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని తామే పూడ్చిపెట్టామని అక్కడ పనిచేస్తున్న మిగతా రైతులు చెప్పారు. ఈ ఘటనలో మేమంతా భయపడ్డాం అని రైతుల వెల్లడించారు.

2009 నుంచి బోకొహరామ్ నైజీరియాలో దాడులకు పాల్పడుతోంది. బోర్నో రాష్ట్రంలో ఈ తీవ్రవాద సంస్థ ప్రాబల్యం అధికంగా ఉంది. తమ సమాచారాన్ని నైజీరియా సైన్యానికి అందిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు, పశువుల కాపర్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. తమ ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చుకోవడం కోసం ఆ దేశంలో అత్యంత విలువైనవిగా పరిగణించే ఆవులను ఎత్తుకెళ్తుంటారు ఉగ్రవాదులు.

ఈ ప్రాంతంలో బోకోహరామ్ తో ప్రేరణ పొందిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కదలికలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే తమ వాళ్లను హతమార్చింది మాత్రం బోకోహరామ్ తీవ్రవాదులే అని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో స్కూళ్లలో చదువుకునే బాలికను కూడా ఎత్తుకెళ్లే వాళ్లు బోకోహరామ్ టెర్రరిస్టులు. నైజీరియాలో దాడులకు ప్రధాన కారణం ఈ ఉగ్రవాద సంస్థే.