Site icon NTV Telugu

లైంగిక వేధింపుల ఆరోపణలు.. గవర్నర్‌కు బిగుస్తోన్న ఉచ్చు..!

Andrew Cuomo

Andrew Cuomo

న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కరోనా సమయంలో ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన ఆయనను.. ఇప్పుడు ఆయన్ను పదవి నుంచి తప్పించేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆండ్రూ క్యూమో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఉద్యోగిని రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆండ్రూ క్యూమో తనను లైంగికంగా వేధించారంటూ ఆయన దగ్గర పని చేసిన ఓ మహిళా ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరో 10 మంది మహిళలు కూడా ఆండ్రూ క్యూమో చేసిన నీచాల గురించి బయటపెట్టారు. దీంతో ఈ ఆరోపణలపై విచారణ జరిగింది.

ఆండ్రూ క్యూమో 11 మంది మహిళలను లైంగికంగా వేధించారని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ తాజాగా ఇచ్చిన నివేదికలో తేల్చింది. అంతేకాకుండా ఆండ్రూ క్యూమో కార్యాలయంలో సీనియర్ కార్యదర్శిగా పని చేస్తున్న మెలిస్సా డెరోసా పేరును 168 పేజీల నివేదికలో 187సార్లు ప్రస్తావించింది. ఓ బాధితురాలి విషయంలో ఆండ్రూ క్యూమో చేసిన అకృత్యాలను కవర్ చేయడానికి మెలిసా డెరోసా ప్రయత్నించారని పేర్కొంది. దీంతో మెలిస్సా డెరోసా.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బాధిత మహిళల్లో ఒకరు కొద్ది రోజుల కింద న్యూయార్క్ గవర్నర్‌పై క్రిమినల్ కేసు పెట్టారు. చేసిన తప్పులకు బాధ్యత వహిస్తూ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అభిశంసన ద్వారా గవర్నర్ పదవి నుంచి ఆండ్రూ క్యూమోను తప్పించే అంశంపై చర్చించేందుకు న్యూయార్క్ అసెంబ్లీ జ్యూడిషియరీ కమిటీ సమావేశం కానుంది. రాజీనామా చేయాలంటూ ఆండ్రూ క్యూమోపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా మరికొందరు డెమొక్రాట్లు కూడా క్యూమో పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు.

Exit mobile version