NTV Telugu Site icon

New Virus: చైనాలో మరో భయంకరమైన వైరస్.. మెదడుపై తీవ్ర ప్రభావం..

Virus

Virus

New Virus: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. తొలిసారిగా ఈ కేసుల్ని 2019లో చైనా లోని వూహాన్ నగరంలో గుర్తించారు. ఆ తర్వాత ఇది ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలకు పాకింది. లక్షల్లో మరణాలకు కారణమైంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది. ఇదిలా ఉంటే, తాజాగా మరో డెడ్లీ వైరస్‌ని చైనాలో కనుగొన్నారు. వెట్‌ల్యాండ్ వైరస్ (WELV) అని పిలువబడే కొత్త వైరస్ చైనాలో కనుగొనబడింది. ఇది కీటకాల కాటు ద్వారా మానవుల్లోకి వ్యాపిస్తుంది.

ఈ వ్యాధి ప్రమాదకరమని పరిశోధకలు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది నాడీ సంబంధిత వ్యాధిని కలిగిస్తుంది. జూన్ 2019లో జిన్‌జఔ నగరంలో 61 ఏళ్ల రోగిలో ఈ వైరస్‌ని తొలిసారిగా గుర్తించారు. బాధితుడు ఇన్నర్ మంగోలియాలోని చిత్తడి నేలల్లో పేలు కాటుకు గురైన ఐదు రోజుల తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. ఇది రోగికి జ్వరం, తలనొప్పి, వాంతుల వంటి లక్షణాలను కలిగిస్తుంది. యాంటీబయాటిక్స్‌కి నిరోధక లక్షణాలను కలిగి ఉంది.

Read Also: Ap Floods : 3 రోజుల్లో 60 వేల మందికి రేషన్ పంపిణీ.. 42 డ్రోన్ల సహాయంతో లక్ష మందికి పైగా ఫుడ్

WELV అనేది క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ వైరస్ మాదిరిగానే పేలు ద్వారా సంక్రమించే వైరస్‌ల సమూహానికి చెందినది, ఇది మానవులలో తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. దీనిని గుర్తించిన తర్వాత పరిశోధకులు ఉత్తర చైనాలో సమగ్ర పరిశోధనని నిర్వహించారు. అక్కడ నుంచి వారు దాదాపుగా 14,600 పేలులను సేకరించారు. వీటిలో దాదాపుగా 2 శాతం WELV జన్యు పదార్ధానికి పాజిటివ్‌గా పరీక్షించబడ్డాయి. ప్రధానంగా ఈ వైరస్ హేమాఫిసాలిస్ కన్సిన్నా జాతికి చెందినది.

WELV RNA గొర్రెలు, గుర్రాలు, పందులు మరియు ట్రాన్స్‌బైకల్ జోకోర్ అని పిలువబడే ఎలుకలలో కూడా కనుగొనబడింది. ఈ వైరస్ మానవుల్లో ఎండోథెలియల్ కణాలలో సైటోపతిక్ ప్రభావాలను చూపిస్తుంది. ఇది జంతువుల్లో ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. పరిశోధకులు అటవీ శాఖలో పనిచేస్తున్న రేంజర్ల నుంచి రక్త నమూనాలను కూడా విశ్లేషించారు. 640 మందిలో 12 మందిలో WELVకి యాంటిబాడీలను కనుగొన్నారు. జ్వరం, మైకము, తలనొప్పి, వికారం, విరేచనాల వంటి లక్షణాలు బాధితుల్లో కనుగొన్నారు. మెదడు, వెన్నెముక ద్రవంలో అధిక తెల్ల రక్త కణాల సంఖ్య కారణంగా ఒక రోగి కోమాలోకి వెళ్లాడు.

చికిత్స తర్వాత రోగులందరూ కోలుకున్నప్పటికీ, ఎలుకలపై ల్యాబ్ ప్రయోగాల్లో WELV ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని మరియు నాడీ వ్యవస్థను ప్రభావితం చేయగలదని తేలింది. ఈ వైరస్ కొన్ని సందర్భాల్లో మామూలు ఇన్ఫెక్షన్‌కి కారణమువుతున్నా, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తోందని, ముఖ్యంగా మెదడుతో సంబంధం కలిగి ఉంటుందని పరిశోధులకు చెప్పారు.