NTV Telugu Site icon

Netaji Mystery: బ్రిటీష్‌ లైబ్రరీలో నేతాజీకి చెందిన 62 దస్త్రాలు

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీయే. అసలు నేతాజీ ఏమయ్యారన్నదానిపై అనేక కథనాలు… ఇంకెన్నో సందేహాలు ఉన్నాయి. ఇంతకీ నేతాజీ గురించి తెలుసుకోడానికి మనం ఏం చేశాం? ఆ ప్రయత్నాలు ఎంత వరకూ ఫలించాయనే దానిపై కేంద్రం వివరణ ఇచ్చింది. నేతాజీ గురించి వివిధ దేశాల్లో ఉన్న రికార్డులు, దస్త్రాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేసినట్టు చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభలో విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్‌ ఈ విషయం తెలిపారు. ఈ మేరకు పలు దేశాలకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారాయన. సభ్యులు అడిగిన ప్రశ్నకు నేతాజీ మరణంపై అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల గురించి తెలిపారు కేంద్ర మంత్రి.

నేతాజీకి సంబంధించిన రికార్డులుంటే భారత్‌కు ఇవ్వాలని అమెరికా, బ్రిటన్‌, రష్యా, జపాన్‌, చైనాలను కోరామన్నారు. కాగా, నేషనల్‌ ఆర్కీవ్స్‌ అండ్‌ బ్రిటీష్‌ లైబ్రరీలో 62 దస్త్రాలు అందుబాటులో ఉన్నాయని బ్రిటన్‌ తెలిపిందన్నారు. తమ వద్ద నేతాజీకి సంబంధించి ఏ పత్రాలూ లేవని రష్యా తెలిపింది. ఇక భారత్‌ విజ్ఞప్తి మేరకు ప్రత్యేకంగా ఆన్వేషించినా… ఏమీ దొరకలేదని వివరించింది. ఇక జపాన్‌ దగ్గర రెండు దస్త్రాలు ఉండగా… వాటని నేషనల్‌ ఆర్కీవ్స్‌ ఆఫ్‌ ఇండియాకు బదిలీ చేసింది. అంతేకాదు… తమ పరిశీలనలో ఇంకేమైనా లభిస్తే నిబంధనలకు లోబడి వాటిని భారత్‌కు అప్పగిస్తామని స్పష్టం చేసింది జపాన్‌. తాము 30 ఏళ్లకు మించి చారిత్రక రికార్డులేవి భద్రపర్చబోమని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు… నేతాజీ కాలం నాటి రికార్డులను డిజిటలైజ్‌ చేయలేదని అమెరికా తెలిపింది.

నేతాజీ అదృశ్యం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు నియమించిన కమిషన్లలో రెండు… ఆయన విమాన ప్రమాదంలో మరణించినట్టు ధ్రువీకరించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే, జస్టిస్‌ ఎం.కే ముఖర్జీ నాయకత్వంలోని కమిషన్‌ మాత్రం నేతాజీ ఆ ప్రమాదంలో చనిపోలేదని నివేదిక ఇచ్చిందన్నారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన అన్ని వాస్తవాలు, పరిస్థితులపై విచారణ చేసేందుకు 1999లో జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నివేదికలో ఓ చోట జపాన్‌లోని ఓ బౌద్ధ ఆలయంలో ఉన్న చితాభస్మం నేతాజీదే కావొచ్చని అన్నారు కేంద్ర మంత్రి. కాగా, జస్టిస్‌ ముఖర్జీ కమిషన్‌ నివేదికను నేషనల్‌ ఆర్కీవ్స్‌ ఆఫ్‌ ఇండియాలో పొందుపర్చినట్టు సభకు వివరించారు కేంద్ర మంత్రి మురళీధరన్‌.

భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు ప్రపంచ నలుమూలలా గల భారతీయులతో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు సుభాష్‌ చంద్రబోస్‌. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఏమయ్యారన్నది నేటికీ ఓ మిస్టరీయే. మనకు స్వాతంత్ర్యం సిద్ధించాక నేతాజీని భారత్‌కు రప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదని కొందరు ప్రశ్నిస్తుంటే… రెండో ప్రపంచ యుద్ధంలోనే విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని చెబుతున్నారు కొందరు.