NTV Telugu Site icon

Nepal: విశ్వాస పరీక్షలో ఓడిపోయిన నేపాల్ ప్రధాని ప్రచండ.. కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలి..?

Prachanda

Prachanda

Nepal: గత కొన్నేళ్లుగా నేపాల్ రాజకీయాలు అనిశ్చితికి మారుపేరుగా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’ శుక్రవారం విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. 275 మంది సభ్యులు ఉన్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ప్రచండకు కేవలం 63 ఓట్లు వచ్చాయి. విశ్వాస పరీక్షకి వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్స్ లెనినిస్ట్(CPN-UML) ప్రచండ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస పరీక్ష అనివార్యమైంది. విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే కనీసం 138 ఓట్లు రావాలి.

Read Also: Anant ambani wedding: అక్షయ్‌కుమార్‌కు కోవిడ్ పాజిటివ్.. పెళ్లికి హాజరుకాలేకపోతున్న హీరో

డిసెంబర్ 25, 2022న పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రచండ ఇప్పటి వరకు నాలుగు సార్లు విశ్వాస పరీక్షల్లో బయటపడ్డారు. అయితే, ఈ సారి మాత్రం ఆయన పదవి కోల్పోనున్నారు. మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి నేతృత్వంలోని సిపిఎన్-యుఎంఎల్ గత వారం సభలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో అధికారం కోసం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా ఇప్పటికే ఓలీని తదుపరి ప్రధానమంత్రిగా ఆమోదించారు. నేపాల్ పార్లమెంట్‌లో నేపాల్ కాంగ్రెస్‌కి 89 సీట్లు ఉండగా, CPN-UMLకి 78 సీట్లు ఉన్నాయి. దిగువ సభలో మెజారిటీకి అవసరమైన 138 సీట్ల కన్నా వీరి బలం 167గా ఉంది. ప్రచంచకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్ట్ సెంటర్)కి 30 మంది సభ్యుల బలం ఉంది.