NTV Telugu Site icon

Sunita Williams: సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేస్తోంది.. నాసా లైవ్‌ షో ఏర్పాటు

Nasasunitawilliams

Nasasunitawilliams

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమ్మీదకు బయల్దేరింది. మరికొన్ని గంటల్లో ఆమె భూమ్మీద ల్యాండ్ కాబోతుంది. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా రానున్నారు. ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లిన పలువురు కూడా వారితో వస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నాసా లైవ్ షో ఏర్పాటు చేసింది.

సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరుకుంది. క్రూ-10 మిషన్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది.

అమెరికా కాలమానం ప్రకారం… మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్‌ క్యాప్సూల్‌ దిగనుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. సునీత, విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమ్మీదకు రానున్నారు.

2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వారం రోజులకే సునీత, విల్మోర్‌ భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే తిరిగి భూమికి వచ్చేసింది. అప్పటి నుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో సునీతా విలియమ్స్ మాత‌ృభూమిని ముద్దాడనున్నారు.