Costly Medicine: మాములుగా అనారోగ్యానికి గురైతే కొనుగోలు చేసే ఔషధాల ధరలు మహా అయితే వేలల్లో లేదా లక్షల్లో మాత్రమే ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం తాజాగా మార్కెట్లో విడుదలైంది. ‘హిమోఫిలియా బి’ అనే సమస్యకు ఈ ఔషధాన్ని సీఎస్ఎల్ లిమిటెడ్ తయారుచేసింది. రక్తం గడ్డ కట్టడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో కూడిన అరుదైన ఈ లోపానికి అందుబాటులోకి వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇదే. ఆస్ట్రేలియాలో ఈ ఔషధం ధరను 3.5 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 28.6 కోట్లు అన్నమాట. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి ఆమోదముద్ర వేసింది. దీంతో హీమోజెనిక్స్ పేరుతో అమెరికాలో ఈ ఔషధాన్ని విక్రయిస్తారు.
Read Also: EWS Reservations: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్
కాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 40 వేల మందిలో ‘హిమోఫిలియా బి’ అనే ఒకరు సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్-9 అనే ప్రొటీన్ లోపం కారణంగా ‘హిమోఫిలియా బి’ అనే సమస్య వస్తుంది. తాము తీసుకొచ్చిన చికిత్సలో జన్యుపరంగా మార్పులు చేసిన వైరస్ ఒక ప్రత్యేకమైన జన్యు పదార్థాన్ని లివర్‌లో ప్రవేశపెడుతుందని, అప్పడు కాలేయం నుంచి ఫ్యాక్టర్-9 విడుదలవుతుందని దాని తయారీ సంస్థ పేర్కొంది. ‘హిమోఫిలియా బి’ సమస్య నివారణకు పలు సంస్థలు చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ వాటితో పోలిస్తే తాజాగా అందుబాటులోకి వచ్చిన చికిత్స దీర్ఘకాలంపాటు ప్రభావవంతంగా ఉంటుంది. ‘హిమోఫిలియో బి’ సమస్యకు ప్రస్తుతం రెండు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకదాని ఖరీదు 2.8 మిలియన్ డాలర్లు కాగా, రెండో దాని ఖరీదు 3 మిలియన్ డాలర్లు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఔషధం ధర 3.5 మిలియన్ డాలర్లు.
