Mohammad Ali Jafari: అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’ ప్రారంభమైన తొలిరోజు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అయినప్పటికీ, ఇరాన్ నాయకత్వం దృఢంగానే ఉంది. ఈ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ముఖ్యంగా, గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రైయిన్, ఖతార్‌లోని యూఎస్ మిలిటరీ బేస్‌లను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తోంది. ఇదే కాకుండా ఆయా దేశాల్లోని గ్యాస్, చమురు క్షేత్రాలపై విరుచుకుపడుతోంది. మరోవైపు, చమురు రంగానికి కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. దీని ద్వారా ప్రపంచంలో ఇంధన సంక్షోభం మొదలైంది.
ఇలా యూఎస్, ఇజ్రాయిల్ భీకర దాడుల ముందు ఇరాన్ నిలవలేదని అంతా అనుకున్నారు. కానీ, ఇరాన్ మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. వెనిజులాలో మదురోను దించి, పాలన మార్చినంత ఈజీగా ఇరాన్‌లో పని అవుతుందని ట్రంప్ భావించాడు. కొన్ని రోజులకే తమ అంచనాలు తప్పాయని ట్రంప్‌కు అర్థమైంది. అయితే, ఇంతలా అమెరికా, ఇజ్రాయిల్‌ను విసిగిస్తున్న వ్యక్తిగా ‘‘మొహమ్మద్ అలీ జాఫారి’’ పేరు తెచ్చుకున్నారు. ఇరాన్ వ్యూహాకర్తగా జాఫారీ దాడుల్ని పెంచుతున్నారు.
ఎవరు ఈ జాఫారి:
ఇరాన్ ‘‘మొజాయిక్ డిఫెన్స్’’ రూపశిల్పిగా మేజర్ జనరల్ మొహమ్మద్ అలీ జాఫారికి పేరుంది. 2007 నుండి 2019 వరకు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) యొక్క కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లోని కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లో పనిచేస్తున్న జాఫారీ ఆ తర్వాత, IRGCలో చేరాడు. దేశం తమ అగ్రనాయకత్వాన్ని కోల్పోయిన, ఇరాన్ తన పోరాటాన్ని చేస్తోంది. అగ్ర నాయకత్వం చనిపోయినా పోరాటం ఎలా చేయాలనే దానిపై ఇరాన్ సైనిక సిద్ధాంతాన్ని రూపొందించాడు.
1979 నుండి 1989 వరకు కొనసాగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో జాఫారి పోరాడాడని మరియు IRGCలో క్రమంగా ర్యాంకుల ద్వారా ఎదిగాడని తెలుస్తోంది. 1992లో, అతను గార్డ్స్ గ్రౌండ్ ఫోర్సెస్ మొత్తానికి కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఎలైట్ IRGC యూనిట్ అయిన సారల్లాకు నాయకత్వం వహించే బాధ్యతను చేపట్టారు.
2005లో జాఫారి IRGC యొక్క సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం, 2003లో US నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఇరాక్‌పై దాడి నుండి పాఠాలను నేర్చుకుని ఇరాన్ తన మొజాయిక్ సిద్ధాంతాన్ని రూపొందించాడని US ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ నివేదిక తెలిపింది.జాఫారి తరువాత 2007లో IRGC యొక్క కమాండర్-ఇన్-చీఫ్‌గా నియమించబడ్డారు. యూఎస్ దళాలు చొచ్చుకుపోకుండా ఈ మొజాయిక్ రక్షణ అడ్డుగా నిలుస్తోంది.
మొజాయిక్ రక్షణ అంటే ఏమిటి?
మొజాయిక్ డిఫెన్స్ అనేది ఇరాన్ సైనిక రక్షణ. దేశ ప్రధాన నాయకత్వం చనిపోయినా, క్షేత్రస్థాయిలో సైన్యం మొండిగా పోరాడేలా రూపొందించారు. సైన్యంలో ఆందోళన లేకుండా చిన్నచిన్న ముక్కలుగా విభజించారు. అధికారం మొత్తం ఒకరి చేతిలో ఉండదు, ప్రతీ ప్రాంతానికి, ప్రతీ యూనిట్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుంది. స్వయంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది. పై నుంచి ఆదేశాలు రాకపోయినా, స్థానిక కమాండర్లు తమ వద్ద ఉన్న ఆయుధాలు, వనరులతో నిర్ణయాలు తీసుకుని యుద్ధం చేయవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
ఇరాన్ తన దేశాన్ని 31 ప్రావిన్షియల్ కమాండ్స్‌గా విభజించింది. ప్రతీ ప్రావిన్స్ కు ఒక ప్రత్యేక సైనిక విభాగం, నిఘా వ్యవస్థ, సొంత ఆయుధాలు ఉంటాయి. IRGC (రివల్యూషనరీ గార్డ్స్), బసీజ్ (Basij) మిలీషియా, రెగ్యులర్ ఆర్మీ కలిసి పనిచేస్తాయి. దేశ రాజధాని టెహ్రాన్‌లో ప్రధాన కార్యాలయం ధ్వంసమైనా, మిగిలిన 31 విభాగాలు దేనికదే స్వతంత్రంగా గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిస్తాయి. తక్కువ బలంతో ఎక్కువ కాలం శత్రువుల్ని వేధించడం. చిన్న చిన్న దాడులతో శత్రువు అలసిపోయేలా చేస్తుంటారు.
